అక్రమ అరెస్ట్‌లు తగదు

29 Jul, 2016 18:37 IST|Sakshi

సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం
సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

సంగారెడ్డి మున్సిపాలిటీ: మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. శుక్రవారం సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ... మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

అక్రమంగా అరెస్టు చేసిన సీపీఎం నాయకుడు మల్లేశం, భాస్కర్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు జరిపి ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు దళారులను నియమించి రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజలకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు సాయిలు, యాదవరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, అశోక్‌, ఆశన్న, మహబుబ్‌ తదితరులు పాల్గొన్నారు.


 

>
మరిన్ని వార్తలు