అంతా అబద్ధం

5 Jul, 2016 03:29 IST|Sakshi
అంతా అబద్ధం

స్థానికంగా ఉంటున్నట్లు నివేదికలు
స్థానికంగా ఉండని ఇన్‌చార్జి ఎంఈవోలు
జిల్లా, నియోజకవర్గ కేంద్రాలే అసలు నివాసం
ఎంఈవోల పర్యవేక్షణ అంతా ప్రయాణంలోనే..
విద్య, ఆదాయ శాఖ అధికారులకు తప్పుడు నివేదికలు
మెరుగైన విద్యకు ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : వారు జిల్లా విద్యాశాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టె రథసారధులు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, బాల కార్మికులను బడిలో చేర్పించడం వంటి విధులతో పర్యవేక్షణ చేయాల్సిన సమయూన్ని ప్రయాణంలో గడిపేస్తున్నారు. రోజు కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుండటంతో విధులకు సకాలంలో రాలేని పరిస్థితి. మరో వైపు వీరంతా డిప్యూటేషన్‌పై పనిచేస్తుండటంతో ఏ పోస్టుకు న్యాయం చేయడం లేదు. మరోవైపు వీరంతా మండల కేంద్రంలోనే నివాసం ఉంటున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆదాయశాఖ   పన్ను శాఖాధికారులకు నివేదికలు మాత్రం పంపుతున్నారు. ఇదంతా ఒక పెద్ద అబద్దం అని తెలిసినా డివిజన్, జిల్లా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు  వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మండల స్థాయిలో విద్యా వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఇదే అదనుగా కొందరు ఉపాధ్యాయులు డుమ్మాలు కొడుతున్నారు.

స్థానికంగా ఉండని  ఇన్‌చార్జి మండల విద్యాశాఖాధికారులు
జిల్లాలో 36 మండలాల్లో గల విద్యాశాఖాధికారుల్లో గాంధారి మండల విద్యాశాఖాధికారి మాత్రమే శాశ్వత పోస్టును కలిగి ఉన్నారు. మిగతా 35 మండలాల విద్యాశాఖాధికారులు డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. జిల్లాలో చాలా మంది విద్యాశాఖాధికారులు నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో ఉంటూ ప్రతినిత్యం వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సమయమంతా ప్రయాణంలోనే గడిపేస్తూ విద్యావ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతలను ఏలుతున్నారు. అటు సొంత పాఠశాలల్లో విధులకు ఎగనామం పెడుతూ.. ఇటు మండల విద్యావ్యవస్థ బాధ్యతలను సక్రమంగా నిర్వహించక విద్యావ్యవస్థను దిగజారే స్థాయికి తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

మండల విద్యాశాఖాధికారులు మారుమూల మండల కేంద్రాల్లోని గ్రామాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు బడులకు డుమ్మాలు కొడుతున్నారనే ఆరోపణలు  ఉన్నాయి. బీంగల్, సిరికొండ, జుక్కల్, గాంధారి, మద్నూరు, బిచ్కుంద మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తున్నది. కామారెడ్డి విద్యా డివిజన్‌లోని కొన్ని మండలాల్లో కూడా ఉపాధ్యాయులు, రియల్ ఎస్టేట్, ఎల్‌ఐసీ వంటి స్థిరాస్తి వ్యాపారాలు చేసుకుంటూ బడులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖాధికారి, విద్యాశాఖ కార్యదర్శి వరకు ఫిర్యాదులు కూడా వెళ్లినా వారిలో మార్పులేదు.

తప్పుడు సమాచారం ఇస్తున్న ఎంఈవోలు
మండల విద్యాశాఖాధికారులు తమ అసలు నివాసం యొక్క చిరునామా గూర్చి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారులకు, ఆదాయం పన్ను శాఖ అధికారులకు ఇచ్చే నివేదికల్లో అసలు నివాసం మండల అభివృద్ధి కార్యాలయాల సమీపంలో నివాసం ఉంటున్నట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అంతా అబద్దం అని తెలిసిన కూడా జిల్లా ఉన్నతాధికారులు సంఘాల యొక్క ప్రతినిధులు ఒత్తిడి వల్ల ఏమి చేయలేక మిన్నకుండి పోతున్నారు.

ఫిబ్రవరిలో సమర్పించిన ఇన్‌కంటాక్స్ పత్రాలలో అందరు ఎంఈవోలు తమ నివాసాలు మండల కేంద్రంలోనే పేర్కొనడం నిజంగా గమనార్హం. కాగా మండల విద్యాశాఖాధికారులు స్థానికంగా ఉండకపోవడం సమయమంతా ప్రయాణంలో గడపడం వల్ల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. నిరంతర పర్యవేక్షణ ఉండకపోవడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుశాతం తగ్గుతున్నది. మారుమూల గిరిజన ప్రాంతాలలో బడులు కూడా సరిగా తెరుచుకోవడం లేదు. అలాగే తమ పాఠశాలల్లో వీరు బోధించాల్సిన సబ్జెక్టులలో విద్యార్థులు  వెనుకబడిపోతున్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా