తెలంగాణ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి

20 Aug, 2016 22:48 IST|Sakshi
తెలంగాణ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
వినాయక్‌నగర్‌ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జీవితాలను త్యాగం చేసినవారి చరిత్రను పాఠ్యపుస్తకాల ద్వారా భావి తరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాంను గత పాలకులు గొప్ప రాజుగా చూపించారన్నారు. నిజాం అరాచకాలకు వరంగల్‌ జిల్లాలోని బైరాన్‌పల్లి, నిర్మల్‌ ప్రాంతంలోని వెయ్యి ఉరిల మర్రి మౌన సాక్షిగా ఉన్నాయన్నారు. అతడు గొప్ప రాజే అయితే కొమరం భీం, చాకలి ఐలమ్మలు నిజాంను ఎందుకు ఎదిరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నరహంతక నిజాం తెలంగాణ ద్రోహులతో కలిసి ప్రజల మాన, ప్రాణాలతో పాటు, ధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. నిజాంల కాలంలో జలియన్‌ వాలాబాగ్‌ లాంటి ఘటనలు తెలంగాణలో ఎన్నో చోటు చేసుకున్నాయని, వాటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. నిజాం నిరంకుశత్వాన్ని, స్వాతంత్య్ర వీరుల త్యాగాలను తిరంగా యాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. జిల్లాల విభజనలో స్పష్టతలేదని, పాలకులకు అనుకూలంగా విభజిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు