కేసుల్లో సొత్తు రికవరీ పెంచాలి

3 May, 2017 20:43 IST|Sakshi
కేసుల్లో సొత్తు రికవరీ పెంచాలి
ఏలూరు అర్బన్‌: జిల్లాలో ప్రస్తుతం తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్న నేపథ్యంలో నేరాలను నియంత్రించడంతో పాటు అపహరణకు గురైన సొత్తు రికవరీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని క్రైం డీఎస్పీ టి.సత్యనారాయణ సూచించారు. స్థానిక కోటదిబ్బ ప్రాంతంలోని సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన ఏలూరు డివిజన్‌లోని ఏలూరు టౌన్, ఏలూరు టూటౌన్, ఏలూరు రూరల్, భీమడోలు, గణపవరం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. చాలా నేరాల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా సొత్తు రికవరీ పూర్తిస్థాయిలో ఉండటం లేదని, ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ తీవ్రంగా పరిగణిస్తున్నారని చెప్పారు. పోగొట్టుకున్న సొత్తును పూర్తిస్థాయిలో అందిస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు సొత్తు రికవరీ పూర్తిస్థాయిలో జరపాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. మహిళా డీఎస్పీ రవికృష్ణకుమార్‌ మాట్లాడుతూ సమాజంలో ఇటీవల ఆడవారిపై వేధింపులు పెరిగాయన్నారు. అయితే బాధితులు చాలా కేసుల్లో వివిధ కారణాలతో స్టేషన్‌లలో ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చినప్పుడు చట్టాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఇటీవల మహిళలపై వరకట్న, లైంగిక వేధింపులతో పాటు చిన్నారులపై అత్యాచారయత్నాలు పెరగడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధితులకు న్యాయం చేసేలా చొరవ చూపాలని సూచించారు. సీఐలు ఎన్‌.రాజశేఖర్, ఉడతా బంగార్రాజు, అడపా నాగమురళి, ఎన్‌.దుర్గాప్రసాద్, సి. Ðð ంకటేశ్వరరావు, ఎస్సైలు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు