ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు

22 Sep, 2016 19:49 IST|Sakshi
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
  • థియేటర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు
  • సత్ఫలితాలిస్తున్న జననీ సురక్ష యోజన 
  • పెరుగుతున్న ఆపరేషన్లు
  • ఈ ఏడాది జిల్లాలో మొత్తం ప్రసవాలు 5561
  • ప్రసూతి ఆపరేషన్లు 2891
  • కరీంనగర్‌ హెల్త్‌ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ప్రసవాలతో సమానంగా ఆపరేషన్‌ ప్రసవాలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండడంతో సాధారణ, ఆపరేషన్‌ ప్రసవాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఆపరేషన్‌ థియేటర్‌ సౌకర్యం కల్పించడంతో ఆపరేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జననీ సురక్ష యోజన ద్వారా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా తల్లీశిశువును పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తుండడం సత్ఫలితమిస్తోంది. 
     
    ఆస్పత్రుల ఆధునీకీకరణతో.. 
    జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకీకరించడంతో మరింత సత్ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలతోపాటు ఆపరేషన్లు కూడా చేసేలా సౌకర్యాలు కల్పిస్తే శిశుమరణాలు కూడా తావులేకుండా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రితోపాటు వైద్య విధానపరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే ఏరియా ఆస్పత్రులతోపాటు ఎనిమిది సీహె చ్‌సీల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇతర పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌సెంటర్లలో సౌకర్యాలు లేవు. జిల్లాలో ప్రధానాస్పత్రితోపాటు గోదావరిఖని, సిరిసిల్ల, జగిత్యాలలో ఏరియా ఆస్పత్రులు ఉండగా.. డీపీహెచ్‌ ఆధ్వర్యంలో నడిచే హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, కోరుట్ల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, వైద్యవిధాన పరిషత్‌ ఆధ్వర్యంలో నడిచే మెట్‌పల్లి, మంథని, మహదేవపూర్, పెద్దపల్లి కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లలో మాత్రమే ప్రసూతి ఆపరేషన్‌కు థియేటర్‌ సౌకర్యం ఉంది. జిల్లాలో మొత్తం 71ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా 28 పీహెచ్‌సీలు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని అర్బన్‌ హెల్త్‌సెంటర్లతోపాటు అన్ని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టింది. 24 గంటల పీహెచ్‌సీల్లో లేబర్‌రూమ్‌తోపాటు ఆపరేషన్‌ థియేటర్‌ సౌకర్యం కల్పించి గైనకాలజిస్టును ఏర్పాటుచేస్తే మరింత మెరుగైన ప్రసూతి సేవలందే అవకాశాలున్నాయి. వీటిలో థియేటర్‌ ఏర్పాటుచేయడంతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులపై భారం తగ్గి మాతాశిశు మరణాలు తగ్గుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
     
    జిల్లాలో ప్రసూతి ఆపరేషన్లు 
    జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2016–17 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు మొత్తం ప్రసవాలు 5561 జరగగా,  సాధారణ ప్రసవాలు 2,670, ఆపరేషన్‌ ప్రసవాలు 2,891 జరిగాయి. ఏప్రిల్‌లో 555 ఆపరేషన్లు, మేలో 526, జూన్‌లో 582, జూలైలో 581, ఆగస్టులో 647 ఆపరేషన్లు జరిగాయి. 2014–15లో 6856 ఆపరేషన్లు, 2015–16లో 7261 ఆపరేషన్లు జరిగాయి. ఏటా  ఈ సంఖ్య సాధారణ ప్రసవాలకు దాదాపుగా సమానంగా ఉంటోంది. థియేటర్లు, గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆపరేషన్‌ ప్రసవాలు మరింత  పెరుగుతాయి.
మరిన్ని వార్తలు