అనంతను అగ్రస్థానంలో నిలుపుదాం

15 Aug, 2017 23:29 IST|Sakshi
అనంతను అగ్రస్థానంలో నిలుపుదాం

స్వాతంత్ర్య దినోత్సవంలో మంత్రి కాలవ
పరేడ్‌ గ్రౌండ్స్‌లో రెపరెపలాడిన తిరంగా జెండా
అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు


అనంతపురం అర్బన్‌: త్రికరణ శుద్ధిగా అందరూ సమష్టిగా కృషి చేసి ‘అనంత’ను అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలపుదామని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహనిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో జరిగిన 71వ స్వాతంత్య్ర దినోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ఫలాలను పేదలందరికీ దక్కేలా జిల్లాలోని ప్రతి ఒక్కరూ యంత్రాగానికి సహకరించాలన్నారు.

రైతన్నకు అండగా నిలుస్తాం
ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు. రుణ ఉపశమనం కింద రెండు విడుతల్లో రూ.2,728 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటికి రూ.1,479 కోట్లను రైతులకు అందజేశామన్నారు. 6.50 మంది రైతులకు రూ.1,032.42 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్లు వాతావరణ బీమాను జమ చేస్తున్నామన్నారు. జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్న నేపథ్యంలో రక్షకతడులిచ్చి ఎండుతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు 5,897 రెయిన్‌గన్‌లు అందుబాటులో ఉంచామన్నారు. సగ్రమ ఉద్యాన అభివృద్ధి మిషన్, ఆర్‌కేవీవై పథకాల ద్వారా 25,439 మంది రైతుల లబ్ధిపొందేలా రూ.35.71 కోట్లు ఖర్చు చేశామన్నారు.

3.45 లక్షల ఎకరాలకు సాగునీరు
హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో పనులు సాగుతున్నాయని మంత్రి కాలవ తెలిపారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణాజలాలు అందించేందుకు రూ.1,171 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. పేరూరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.813 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే రూ.463.50 కోట్లతో తుంగభద్ర ఎగువ కాలువ వెడల్పు పునులు జరుగుతున్నాయన్నారు. రూ.519 కోట్లతో యాడికి కాలువ పనులు జరుగుతున్నాయనీ, రూ.509 కోట్లతో మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువ పనులు త్వరలోనే చేపడతామన్నారు.

డ్వాక్రా మహిళలకు చేయూత
డ్వాక్రా మహిళలకు చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తున్నామని కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఏడాది 70,980 సంఘాలకు రూ.1,976 కోట్లు రుణాలు ఇప్పించామన్నారు. పుసుపు–కుంకుమ కింద 81,510 సంఘాలకు రూ.399 కోట్లు, వడ్డీ రాయితీ కింద 56,564 సంఘాలకు రూ.197 కోట్లు అందజేశామన్నారు.

నిరుపేదలకు నీడ కల్పిస్తాం
ఇల్లులేని నిరుపేదలకు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేసి నీడ కల్పిస్తామని మంత్రి తెలిపారు. యూనిట్‌ విలువ రూ.1.50 లక్షల చొప్పున గత ఏడాది జిల్లాలో 17,400 గ్రామీణ గృహాలను కేటాయించామన్నారు. ఇందులో 4,202 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. ఎన్టీఆర్‌(గ్రామీణ్‌) పథకం కింద రూ.2 లక్షలు యూనిట్‌ విలువతో 1,322 ఇళ్ల నిర్మాణానికి రూ.26.44 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్య, వైద్యం, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. తాగునీరు, రహదారుల అభివృద్ధి చర్యలు తీసుకున్నామన్నారు.

పారిశ్రాకంగా అభివృద్ధి చేస్తాం
జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు. పెనుకొండ మండలం ఎర్రమంచి వద్ద 600 ఎకరాల్లో రూ.13 వేల కోట్లతో కియా కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద రూ.200 కోట్లతో ఎయిర్‌బస్, సొమందేపల్లి మండలం గుడిపల్లి, కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం వద్ద 2,143 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్కులు, పారిశ్రామిక వాడలు, బీకేఎస్‌ మండలం సిద్దరాంపురం వద్ద 151 ఎకరాల్లో నూనెగింజల పరిశోధన కేంద్రం ఏర్పాటుకు భూములు సేకరించామన్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే  భెల్, రాగమయూరి ఎలక్ట్రానిక్స్‌ పార్క్, జేఎన్‌టీయూలో ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ప్రారంభానికి చర్యలు తీసుకున్నామన్నారు. వేడుకల్లో కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్‌పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ టి.కె.రమామణి, జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్దీన్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, గోనగుంట్ల సూర్యనారాయణ, వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మేయర్‌ మదమంచి స్వరూప, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న శకటాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడకల సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన ప్రగతి శకటాలు ఆకట్టుకున్నాయి. వీటిలో డీఆర్‌డీఏ శాఖ ప్రదర్శించిన శకటానికి ప్రథమ బహుమతి, వ్యవసాయ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, డ్వామా శకటానికి తృతీయ బహుమతిని మంత్రి చేతుల మీదుగా ఆయా శాఖల అధికారులు అందుకున్నారు. మైదానంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించారు. అదే విధంగా లబ్ధిదారులకు ఆస్తులను పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు