నేటి నుంచి ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో

23 Sep, 2016 10:07 IST|Sakshi
  • ముస్తాబైన విశాఖ పోర్టు ట్రస్ట్ డైమండ్ జూబ్లీ స్డేడియం
  • 2 వేల మంది ప్రతినిధులు, 200 మంది విదేశీ ప్రతినిధులు హాజరు
  • 167 స్టాల్స్ ఏర్పాటు.. ప్రారంభోత్సవానికి సీఎం, కేంద్ర మంత్రుల రాక
  •  
    విశాఖపట్నం : 20వ ఇండియా ఇంటర్నేషనల్ సీఫుడ్ షో-2016కు విశాఖ వేదికవుతోంది. పదిహేనేళ్ల తర్వాత మరోసారి ఈ మెగా ఈవెంట్ విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. మొట్టమొదటి  షో 1973లో ముంబైలో జరిగింది. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. చివరి మూడు ప్రదర్శనలు చెన్నైలోనే జరిగాయి. 2001 తరువాత మరోసారి ఈ ప్రదర్శన కోసం విశాఖలోని పోర్టు ట్రస్ట్ జూబ్లీ స్టేడియం ముస్తాబైంది.
     
    సముద్ర, ఆక్వా ఉత్పత్తులతోపాటు ఎగుమతులను గణనీయంగా పెంచుకోవడం, ప్రతి రెండేళ్లకోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చే మార్పులు, చేర్పులను ఆకళింపు చేసుకోవడం, అత్యాధునిక టెక్నాలజీని పరస్పరం అందిపుచ్చుకోవడమే ఈ షో లక్ష్యం. దేశీయంగా ఏటా మత్స్య ఉత్పత్తుల ఎగుమతులను పెంచుకోవడం ద్వారా విదేశీ మారక ద్రవ్యం పెంపొందించుకోవాలన్న లక్ష్యంతో ఈ షోలకు కేంద్రం చేయూతనిస్తుంటుంది.
     
    అఖిల భారత సీఫుడ్ ఎగుమతిదారుల సంఘం, ఎంపెడాల సంయుక్త సహకారంతో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో యూఎస్‌ఏ, జపాన్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, స్పెయిన్, యూకే, వియాత్నం, చైనా, తైవాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలు పాల్గొంటున్నాయి. 2 వేల మంది  ప్రతినిధులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తుండ గా.. ఇప్పటి వరకు 732 మంది రిజిస్టర్ చేయించుకున్నారు.
     
    అదేవిధంగా 200మంది వరకు విదేశీ ప్రతినిధులొస్తారని అంచనా వేయగా.. ఇప్పటివరకు 66 మంది రిజిస్టర్ చేయించుకున్నారు.1,250 మంది భారతీయ అధికారులు ప్రదర్శనలో పాల్గొనున్నారు. ప్రదర్శనను తిలకించేందుకు సుమారు 500 మంది సందర్శకులొస్తారని అంచనా వేస్తున్నారు. 27 విదేశీ కంపెనీలు, 117 భారతీయ సీఫుడ్ కంపెనీలు పాల్గొంటున్నాయి.
     
    మత్స్య ఉత్పత్తులు, సీఫుడ్ ఇండస్ట్రీస్ ఆధునిక టెక్నాలజీని ప్రతిబింబించేలా 167 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటిలో 27 స్టాల్స్ విదేశీ కంపెనీలే ఏర్పాటు చేస్తున్నాయి. తొలి రెండు రోజులు విదేశీ ప్రతినిధులు, డెలిగేట్స్‌కే స్టాల్స్‌కు అనుమతిస్తారు. చివరి రోజు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు.
     
    కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ షోను ప్రారంభించనున్నారు. ప్రదర్శనను తొలి రోజు ఉదయం 9.30 గంటలకు ప్రారంభిస్తారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమం మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుంది. వెయ్యిమంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు