‘బాహుబలి’లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది

4 May, 2017 22:59 IST|Sakshi
‘బాహుబలి’లో భాగస్వామి కావడం గర్వంగా ఉంది
- ఇండియన్‌ ఐడల్‌ విజేత రేవంత్‌
రావులపాలెం (కొత్తపేట) : తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన బాహుబలి చిత్రంలో గాయకుడిగా తాను కూడా భాగస్వామి కావడం గర్వంగా ఉందని సినీ గాయకుడు, ఇండియన్‌ ఐడల్‌ విజేత కేఎల్‌ రేవంత్‌ అన్నారు. రావులపాలెంలో బాహుబలి-2 చిత్రం ప్రదర్శిస్తున్న శ్రీ వెంకటేశ్వర థియేటర్‌ వద్ద వైఎస్సార్‌ సీపీ జిల్లా పారిశ్రామిక విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు ఆధ్వర్యాన గురువారం సాయంత్రం రేవంత్‌ను ఘనంగా సన్మానించారు. ఇండియన్‌ ఐడల్‌ విజేతగా నిలిచిన ఆయనకు రవిరాజు, ప్రభాస్‌ అభిమానులు పూలకిరీటం, పూలమాలలు, జ్ఞాపిక, శాలువాలతో ఘనంగా సన్మానించారు. రేవంత్‌ మాట్లాడుతూ, తెలుగు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న తన సన్నిహితులు, అభిమానులు, పెద్దల ఆశీస్సులతోనే తాను ఈ ఘనత సాధించానన్నారు. ఈ కృషిలో తల్లిదండ్రులు, తోటి గాయకుల ప్రోత్సాహం మరువలేనిదన్నారు. ఈ విజయంలో తన కృషితోపాటు ప్రజల ఓటింగ్‌ కూడా కీలక పాత్ర పోషించాయన్నారు. రవిరాజు తనకు మంచి మిత్రుడని, ఆయన సహకారంతోనే జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. ప్రభాస్‌కు తాను పెద్ద అభిమానినని ప్రభాస్‌ అభిమానుల సమక్షంలో సత్కారం పొందడం సంతోషంగా ఉందని అన్నారు. సచిన్‌ టెండూల్కర్, ఎస్‌ఎస్‌ రాజమౌళి తనకు స్ఫూర్తి అన్నారు. బాహుబలి సినిమాలోని ప్రతి సన్నివేశం అమోఘంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఆయన బాహుబలి-1లో తాను ఆలపించిన ‘మనోహరీ..’ గీతాన్ని ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరో గాయని గీతామాధురి బాహుబలి-2 చిత్రంలోని ‘దండాలయ్యా’ పాట పాడి అలరించారు. కార్యక్రమంలో గాయకుడు శ్రీకృష్ణ, యాంకర్‌ అశ్వని, ప్రభాస్‌ అభిమాన సంఘ నాయకులు వేగిశ్న మణికంఠవర్మ, దాట్ల రాకేష్‌వర్మ, సయ్యపరాజు నరసింహరాజు, తాడిపూడి బాబు, నడింపల్లి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు