భారతీయ సంప్రదాయాలు మహోన్నతమైనవి

29 Jan, 2017 22:33 IST|Sakshi
భారతీయ సంప్రదాయాలు మహోన్నతమైనవి
–మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు
కర్నూలు(హాస్పిటల్‌): ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావు అన్నారు. వికాసభారతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్‌ హైస్కూల్‌ ఆవరణలో ‘భారతీయ శంఖారావం’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన గరికపాటి నరసింహరావు మాట్లాడుతూ  మనం అన్ని దేశాలను, మతాలను గౌరవిస్తూనే మన సంప్రదాయాలను ఆచరించాలన్నారు. గుడితో పాటు గుండెలోనూ దేవుడిని కొలువు చేసుకోవాలని సూచించారు.
 
శాస్త్రం ప్రకారం శివలింగానికే అభిషేకం చేయాలని, ఇతర విగ్రహాలకు అర్చన చేయాలని సూచించారు. ఆంగ్లేయులు మన దేశీయులను శారీరకంగా, మానసికంగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. దానికి కొనసాగింపుగా నేటి ప్రభుత్వాలు మున్సిపల్‌ పాఠశాలల్లో  తెలుగు భాషను తీసేస్తున్నాయని విమర్శించారు. మాతృభాషను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.  హంపి పీఠాధిపతి జగద్గురు విద్యారణ్యభారతి స్వామి మాట్లాడుతూ  సంస్కారంతో కూడిన చదువే భవిష్యత్‌కు పునాది అవుతుందన్నారు. మహిళలు సన్మార్గాన్ని చూపే కార్యక్రమాలను టీవీల్లో చూడాలన్నారు.  కార్యక్రమంలో వికాసభారతి సంఘటనా కార్యదర్శి నాగేంద్రప్రసాద్, అధ్యక్షుడు సుజాతశర్మ, భారతీయ స్ఫూర్తి కేంద్రం కార్యదర్శి శివప్రసాద్, ఉపాధ్యక్షులు హుసేన్‌రెడ్డి పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు