-

హరిత విప్లవ ప్రధాత ఇందిరాగాంధీ

18 Nov, 2016 22:11 IST|Sakshi
హరిత విప్లవ ప్రధాత ఇందిరాగాంధీ
- పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి 
 
కోడుమూరు రూరల్‌ హరిత విప్లవ ప్రధాత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అని పీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ శతజయంతిని పురస్కరించుకొని కోడుమూరులో శనివారం తలపెట్టిన రైతు మహాసభ సభా స్థలాన్ని శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు రఘువీరెడ్డి, ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడారు. కరువుతో అల్లాడుతున్న భారతదేశంలో హరిత విప్లవానికి ఇందిరమ్మ నాంది పలికారన్నారు. హరిత విప్లవంతో దేశంలో 50మిలియన్‌ మెట్రిక్‌ టన్నులున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి 270మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరుకుందన్నారు. ఇందిరమ్మ ప్రధానమంత్రిగా సాధించిన విజయాలపై ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా మొదటి రైతు మహాసభను కోడుమూరులో నిర్వహిస్తున్నామన్నారు. 
కార్యక్రమ వివరాలు..
ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 8:30గంటలకు స్టేట్‌ గెస్ట హౌస్‌కు ఏఐసీసీ బృందం చేరుకుంటుంది. 8:45 జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాళ వేసి శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. 9గంటలకు ఇందిరాగాంధీ, దామోదరం సంజీవయ్య విగ్రహాలకు పూలమాళలు వేస్తారు. 10గంటలకు కోడుమూరు చేరుకొని మొండికట్టవాగు నుంచి ఎద్దులబండ్లతో భారీ ర్యాలీతో కోట్ల సర్కిల్‌ చేరుకుంటారు. 10:30కు కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహానికి పూలమాళ వేసి ఇందిరమ్మ బెలూన్లను విడుదల చేస్తారు. 11గంటలకు మహాత్మగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాళలు వేసి సభా స్థలికి చేరుకుంటారు. 11నుంచి 2గంటల వరకు రైతులనుద్దేశించి బహిరంగ సభ, మధ్యాహ్నా భోజనం అనంతరం లద్దగిరిలో ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల కమిటీలతో సమావేశం జరుగుతుంది. విలేకరుల సమావేశంలో కిసాన్‌ సెల్‌ రాష్ట్ర చైర్మన్‌ రవిచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌బాబు, జిల్లా అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్దన్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, గ్రామ సర్పంచు సిబి.లత పాల్గొన్నారు. 
 
పెద్ద నోట్ల రద్దు తుగ్లక్‌ చర్య  – పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే పెద్ద నోట్లను రద్దు చేయడం పిచ్చి తుగ్లక్‌ చర్యగా పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభివర్ణించారు. శుక్రవారం కళావెంకట్రావ్‌ భవనం, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇంతకు ముందు రెండుసార్లు పెద్దనోట్ల రద్దు జరిగినా అవి తక్కువ శాతంలో ఉండటం వల్ల సమస్య రాలేదన్నారు. ప్రస్తుతం ఉన్న 14 శాతం చిన్ననోట్లతో ప్రజల అవసరాలు ఎలా తీరతాయనే ముందు చూపు ఈ ప్రభుత్వానికి లేదన్నారు. మోదీ వేసిన బాణం పెద్దలకు కాకుండా పేదలకు గుచ్చుకుందన్నారు.  
 
మరిన్ని వార్తలు