క్రీడలపై చిత్తశుద్ధి ఇదేనా?

22 Aug, 2016 23:44 IST|Sakshi
క్రీడలపై చిత్తశుద్ధి ఇదేనా?
ఏడాదిన్నరగా మూతపడిన ఇండోర్‌ కోర్టు
టీడీపీ నేతల ఒత్తిడితోనే మూసివేత?
 
 
చీపురుపల్లి : రియో ఒలింపిక్స్‌లో ప్రపంచ స్థాయిలో భారతదేశానికి బ్యాడ్మింటన్‌ క్రీడ గుర్తింపును తీసుకొచ్చింది. ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారతదేశానికి చెందిన తెలుగు అమ్మాయి పూసర్ల సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఏపీ ముఖ్యమంత్రి రూ.3 కోట్లు నజరానా కూడా ప్రకటించారు. అయితే రాష్ట్ర మంత్రి కిమిడి మణాళిని సొంత నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లి పట్టణంలో అదే తెలుగుదేశం నాయకులు ఎంతో ప్రాముఖ్యం కలిగిన షటిల్‌ ఇండోర్‌ స్టేడియంను మూసివేయించారు. ఓ వైపు తన వల్లే సింధు ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిందని ముఖ్యమంత్రి చెబుతుంటే.. అదే పార్టీ నాయకులు చీపురుపల్లిలో ఇండోర్‌ కోర్టు మూసివేయించడం వెనుక క్రీడలపై వారికున్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోంది. సౌకర్యాలు లేని చోట ఎలాగూ క్రీడలు అభివద్ధి చెందడం లేదు, ఉన్న సదుపాయాలను వినియోగించుకోలేకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రియో ఒలింపిక్స్‌లో సింధు షటిల్‌ బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించడంతో స్థానికంగా ఇండోర్‌ షటిల్‌ కోర్టుపై క్రీడాకారుల్లో చర్చ మొదలైంది. 
 
 
ఏడాదిన్నర క్రితం ఇండోర్‌ కోర్టు మూత..
జిల్లాలోని ఏ మండలంలోనూ లేని విధంగా చీపురుపల్లిలో షటిల్‌ ఇండోర్‌ కోర్టును అప్పటి పాలకులు, ప్రస్తుత వైఎస్సార్‌సీపీ నాయకులు బొత్స సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, మజ్జి శ్రీనివాసరావులు తయారు చేయించారు. వ్యవసాయశాఖకు చెందిన, ఆ శాఖ వినియోగించకుండా వదిలేసిన గోదాములో దీనిని ఏర్పాటు చేశారు. అప్పటి ఎంపీ ఝాన్సీలక్ష్మి నిధులతో వుడెన్‌ కోర్టు, జిమ్‌ వంటి సదుపాయాలు కల్పించారు. ఏటా షటిల్‌ శిక్షణా తరగతులు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలతో ఇండోర్‌కోర్టు కళకళలాడుతూ ఉండేది. అంతేకాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వందల సంఖ్యలో ఈ కోర్టులో షటిల్‌ ఆడుతుండేవారు. 
 
 
టీడీపీ అధికారంలోకి వచ్చాకే...
టీడీపీ అధికారంలోకి వచ్చాక కొత్త సదుపాయాలు రాలేదు సరికదా ఉన్న సౌకర్యాలు ఊడగొట్టారు. షటిల్‌ ఇండోర్‌కోర్టు వారిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేసిందో తెలియదు గానీ ఏడాదిన్నర క్రితం మూసివేయించారు. వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించి ఆ గోదాము స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇండోర్‌ కోర్టులో ఉన్న వుడెన్‌ కోర్టు పాడయ్యింది. ఏడాదిన్నరగా కోర్టు తెరిపించాలంటూ క్రీడాకారులు కోరుతున్నప్పటికీ పట్టించుకోలేదు. చివరకు పట్టణంలో నిత్యం షటిల్‌ ఆడుకునే క్రీడాకారులు గరివిడి తదితర ప్రాంతాల్లో ఉండే కోర్టులకు వెళ్లి ఆడుకోవాల్సి వస్తోంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగే వేసవి శిక్షణా శిబిరం కూడా బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించుకోవాల్సి వస్తోంది.
 
 
ఫొటోరైటప్‌
21సిపిపి01. మూతపడిన షటిల్‌ ఇండోర్‌కోర్టు
మరిన్ని వార్తలు