పారిశ్రామిక సంక్షోభం!

7 Nov, 2016 00:09 IST|Sakshi
పారిశ్రామిక సంక్షోభం!
– జిల్లాలో 500 పరిశ్రమలకు తాళాలు
– ఇందులో పది పెద్దతరహా పరిశ్రమలు 
– 300 ఆయిల్, 150 రైస్‌ మిల్లులు బంద్‌
– ఉపాధి దూరమైన వేలాది మంది కార్మికులు
– కొత్త పరిశ్రమలు అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం
– టెక్స్‌టైల్‌ పార్కు ఊసే ఎత్తని ముఖ్యమంత్రి చంద్రబాబు 
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాను పరిశ్రమల హబ్‌గా మారుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావుడి చేస్తున్నారు. కొత్త పరిశ్రమలంటూ వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కుంటున్నారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం లేక..యాజమాన్యాల వైఖరితో జిల్లాలో దాదాపు 500 పరిశ్రమలు మూతపడ్డాయి. ఏళ్లుగా వీటికి తాళాలు ఉన్నా తెరిపించే నాథుడు కరువయ్యాడు. ఎన్నికల సమయంలో వీటిని తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తామని టీడీపీ నేతలు ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయి.  
 
జిల్లాలోని కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, వెల్దుర్తి, బేతంచెర్ల, డోన్, బనగానపల్లె, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 150 నుంచి 5 వేల మందికి ఉపాధిని కల్పించే పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఆయా యాజమాన్యాల వైఖరి, ప్రభుత్వ ప్రోత్సాహం కరువడంతో చాలా చోట్లా పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిలో వెయ్యి నుంచి 2 వేలకు పైగా కార్మికులకు ఉపాధిని కల్పించే పరిశ్రమలు పదికిపైగా ఉన్నాయి.  మూతపడిన (2006లో) రాయలసీమ పేపర్‌ మిల్‌ పరిశ్రమలో ఐదు వేల మంది కార్మికులు పనిచేసేవారు. ఇది కేవలం యాజమాన్యం వైఖరి కారణంగా మూతపడినట్లు కార్మికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక కర్నూలుకు సమీపంలోని కార్బైడ్‌ ఫ్యాక్టరీ రాజకీయా కారణాలతో బంద్‌ అయింది. ఈ పరిశ్రమ నిర్వహణకు పూర్తిగా కరెంట్‌ వినియోగమే అధికం. అయితే రాయితీపై కరెంట్‌ సరఫరాను నిలిపివేయడంతో పరిశ్రమకు తాళాలు వేయడంతో వెయ్యి మంది కార్మికులు రోడ్డున పడ్డారు. వీటితోపాటు ఆదోనిలో కొఠారి స్పిన్నింగ్‌ మిల్లులో మూతపడడంతో 1200 మంది, రాయలసీమ స్పిన్నింగ్‌ మిల్, బంద్‌కావడంతో 1500 మంది, ఏటీ ఆయిల్‌ ఫ్యాక్టరీ నడవకపోవడంతో 700 మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఇక ఎమ్మిగనూరులో ఎమ్మిగనూరు స్పిన్నింగ్‌ మిల్స్, నంద్యాలలో కోపరేటివ్‌ స్పిన్నింగ్‌ మిల్, కో పరేటివ్‌ చక్కెర కర్మాగారం మూతపడడంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 
 
ఉపాధి కోల్పోయిన కార్మికులు
పదేళ్ల క్రితం జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర ప్రాంతాల్లో  వెయ్యికిపైగా నూనె, రైస్‌ మిల్లులు ఉండేవి. అంతేకాక బనగానపల్లె, బేతంచెర్ల, డోన్, కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో క్రస్సర్‌ మిషన్లు, బండల ఫ్యాక్టరీలు ఉండేవి. డోన్‌లో సున్నపు ఫ్యాక్టరీలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం అక్కడ ఒక్క సున్నపు ఫ్యాక్టరీ కూడా కనిపించడంలేదు. ప్రస్తుతం వీటిలో సగానికిపైగా మూతపడ్డాయి. దీంతో వేలాది మంది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. 
 
కొత్త పరిశ్రమలంటూ హడావుడి..
ప్రస్తుతం జిల్లాలో కొత్త పరిశ్రల స్థాపన అంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకొని ఓర్వకల్లు సమీపంలో పరిశ్రమల హబ్‌ స్థాపనకు చర్యలు తీసుకొంటోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంలేదు. ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కూడా కనిపించడంలేదు. ఈనేపథ్యంలో మూత పడిన పరిశ్రమలను తెరిపించాలనే వాదన బలపడుతోంది.  
 
టెక్స్‌టైల్‌ పార్కు ఊసే లేదు..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2014 ఆగస్టు 15వ తేదీన కర్నూలులో జరిగిన స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొని జిల్లాకు పలు హామీలు ఇచ్చారు. అందులో టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఒక్కటి. ఈ హామీకి రెండేళ్లు వచ్చినా ఆచరణలో మాత్రం ఊసే కనిపించడంలేదు. దీంతో కార్మిక లోకం తీవ్ర మనోవేదనకు గురవుతోంది. 
 
 
మరిన్ని వార్తలు