రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం

28 Mar, 2017 21:41 IST|Sakshi
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం

= హెచ్చు మీరిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి
= అదే దారిలో అధికారులు కూడా..
= ఎంఎస్‌ఈడీసీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు ధ్వజం


ఒంగోలు క్రైం : రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యమైపోయిందని, కోలుకోలేని స్థితికి చేరుకుందని మైక్రో స్మాల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఎస్‌ఈడీసీ) రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రామారావు ధ్వజమెత్తారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎంఎస్‌ఈడీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.లక్ష్మీరాజ్యంతో కలిసి మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన చంద్రబాబు దాన్ని పక్కన బెట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం ఆరాట పడటం అన్యాయమన్నారు. ప్రత్యేక హోదా ఉంటే రాష్ట్రంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. అదే ప్రత్యేక ప్యాకేజీ అయితే ఒక్క చంద్రబాబుకు మాత్రమే ప్రయోజనం ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాష్ట్రంలో మూడేళ్లలో కొత్తగా ఏ ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 సీఐఐ పార్టనర్‌ షిప్‌లో ఏడాది రూ.4 లక్షల 83 వేల కోట్లు, రెండో సంవత్సరం రూ.11 లక్షల 22 వేల కోట్లు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఐదారు దేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు ఘనంగా వస్తాయని ఊకదంపుడు ఉపన్యాసాలు గుప్పించారని, అవన్నీ ఏ మయ్యాయని దుయ్యబట్టారు. పారిశ్రామిక రంగానికి విద్యుత్‌ చార్జీల మోత మోగిస్తున్నారని, ఎల్‌టీ పారిశ్రామిక వేత్తలకు పవర్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ.7లు చొప్పున, ఫిక్స్‌డ్‌ చార్జీల కింద 41.13 పైసలు, హెచ్‌డీ కేవీఏకు 385.13 పైసలు వసూలు చేస్తున్నారని వివరించారు. విద్యుత్‌ టారిఫ్‌ పెంచినా, ఫిక్స్‌డ్‌ చార్జీలు పెంచినా, డిమాండ్‌ చార్జీలు పెంచినా పారిశ్రామిక రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 39 రీసైకిల్‌ పేపర్‌ ఇండస్ట్రీస్‌ ఉన్నాయని, వాటికి రా మెటీరియల్‌ దొరకక అల్లాడుతుని చెప్పారు. దీనికి తోడు చైనా నుంచి వైట్‌ పేపర్‌ తక్కువ ధరకు దిగుమతి అవుతోందన్నారు. పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించేందుకు ఒక్క మంత్రి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కమీషనర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ లేకపోవటం కూడా పారిశ్రామిక రంగం వెనుకబాటుకు ప్రధాన కారణమని చెప్పారు.

కులాల మధ్య చిచ్చు పెడుతున్న సీఎం: అధికారంలోకి రావడం కోసం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంటని, అన్ని వర్గాల వారికి రుణమాఫీ..అని లేనిపోని ఆశలు చూపి కులాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి రాగానే సంపాదించిన అవినీతి సొమ్ముతో ఓట్లు కొనుక్కొని తిరిగి అధికారంలోకి రావచ్చని భావిస్తున్నాని విమర్శించారు. రుణమాఫీ తప్పుడు నిర్ణయమని, దానివల్ల ధనవంతులే లాభపడ్డారన్నారు. ప్రభుత్వ, ఉడా ఆస్తులను బంధువులు, స్నేహితులకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు అవినీతితో అన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా అవినీతి పెరిగిపోయిందన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని గ్యాస్‌ను రిలయన్స్‌ కంపెనీ అధినేత ముఖేష్‌ అంబానీకి కట్టబెట్టి సీఎం రూ.లక్షల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. పారిశ్రామిక రంగంపై చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని పారిశ్రామిక కేంద్రాలను సూక్ష్మ చిన్న పరిశ్రమల వ్యాపార అభివృద్ధి సంస్థకు కేటాయించాలని రామారావు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు