పేరుకే ‘అమృతం'

21 Mar, 2017 03:38 IST|Sakshi
పేరుకే ‘అమృతం'

► అంగన్ వాడీ కేంద్రాలకు నాసిరకం పాలు సరఫరా
► దుర్వాసన వస్తున్న ప్యాకెట్లను తిరస్కరిస్తున్న గర్భిణులు, బాలింతలు
► నివేదికలు పట్టించుకోని అధికారులు     
► కోట్లు గడిస్తున్న కాంట్రాక్ట్‌ సంస్థ


చిలకలపూడి(మచిలీపట్నం): రేపటి తరం చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్ వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులకు సరఫరా చేస్తున్న పాలలో నాణ్యత లోపించింది. నాసిరకం పాలను సరఫరా చేస్తూ కాంట్రాక్ట్‌ సంస్థ కోట్లను గడిస్తూ పేద గర్భిణులు, బాలింతల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నా సంబందిత అధికారులు స్పందించకపోవటం పలు అనుమానాలకు తావీస్తోంది. ఈ పాలు మాకొద్దంటూ లబ్ధిదారులు తిరస్కరిస్తున్న నేపథ్యంలో అంగన్ వాడీల నుంచి పాల నాణ్యతపై క్షేత స్థాయి నుంచి లిఖితపూర్యకంగా ఫిర్యాదు అందినా చర్యలకు జిల్లాస్థాయి అధికారులు వెనకడుగువేస్తున్నారు.

ఉత్పత్తి జరుగుతున్న ఆహార ధాన్యాలు రోజురోజుకీ కలుషితం కావడంతో గర్భిణులు, బాలింతల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. శరీరంలో రక్తం సరిగ్గా లేకపోవటం, కాన్పుల సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శిశువులు అనారోగ్యంతో పుట్టడం, పుట్టిన వెంటనే చనిపోవటం తరచూ జరుగుతుంది. గతంలో అత్యధికంగా ఇలాంటి కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించింది. జిల్లాలో అవనిగడ్డ, గూడూరు, పెడన, మచిలీపట్నం, మైలవరం, తిరువూరు, నందిగామ మండలాల్లో గర్భిణులు, బాలింతలు పోషకాహారం అందక ఇబ్బందులు పడుతున్నారని ఈ సర్వే తేల్చింది.

స్పందించిన ప్రభుత్వం అమృత హస్తం పథకం పేరుతో ఆయా మండలాల్లోని గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పాలను సరఫరా చేసేందుకు సిద్ధమైంది. రెండేళ్లుగా ఆయా మండలాల్లో ఈ పథకం అమలు జరుగుతోంది. ఒక్కో గర్భిణి, బాలింతకు రూ.200 మిల్లీలీటర్ల పాలను ప్రతిరోజూ అందజేస్తున్నారు. ఈ పథకం అమలు చేసిన తొలినాళ్లలో ఆయా గ్రామాల్లోని అంగన్ వాడీ కార్యకర్తలే పశుపోషకుల నుంచి పాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందజేసేవారు. మార్కెట్‌ ధర ప్రకారమే లీటరుకు రూ.40 చొప్పున ప్రభుత్వం చెల్లించేంది. కొందరు ప్రభుత్వ పెద్దలు పాల సరఫరా కాంట్రాక్ట్‌ను ఓ కంపెనీకి అప్పగించారు. ప్రస్తుతం సదరు కంపెనీ అంగన్ వాడీలకు లీటరు, అర లీటరు ప్యాకెట్‌లను సరఫరా చేస్తోంది. ఆయా మండలాల్లోని 357 ఐసీడీఎస్‌ సెక్టార్‌లలోని 8,672 మందికి లబ్ధిదారులకు ప్రతిరోజూ పాలను సరఫరా చేస్తున్నారు.

 పేదల ఆరోగ్యంతో చెలగాటం  
ప్రతిరోజూ సరఫరా సంస్థకు ప్రభుత్వం రూ.69,376ను అందజేస్తున్నట్లు ఐసీడీఎస్‌ అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌ ధరతోపాటుగానే నగదు చెల్లింపులు చేస్తున్నా 1.5 శాతం వెన్న (లోఫ్యాట్‌) ఉన్న పాలనే సరఫరా చేస్తున్నారు. నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం బిల్లుల రూపంలో తీసుకుంటూ పేద కుటుంబాల్లోని గర్భిణులు, బాలింతల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని అంటున్నారు. నాసిరకం పాల సరఫరా వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యం లో జిల్లా స్థాయి అధికారుల ఫిర్యాదులు సైతం బుట్టదాఖలవుతున్నాయని ఆరోపిస్తున్నారు.

పాలు చూస్తే వాంతి రావాల్సిందే..
90 రోజుల నిల్వ సామర్ధ్యంతో కంపెనీ సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్‌లు పూర్తి నాసిరకంగా ఉంటున్నాయని గర్భిణులు, బాలింతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఒక్కో అంగన్ వాడీ కేంద్రానికి నెలకు సరిపడా ప్యాకెట్‌లను ఒకేసారి సరఫరా చేస్తున్నారు. రెండు రోజులపాటు పాలు బాగానే ఉంటున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. అక్కడ నుంచి ప్యాకెట్‌ ఒక్కసారిగా ఉబ్బిపోయి భరించలేని దుర్వాసన వస్తున్నాయని వాపోతున్నారు.

పాల దుర్వాసనకు వాంతులు అవుతున్నాయని చెబుతున్నారు. వాసన భరించలేక పిల్లలు శ్యాస సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని వాపోతున్నారు. కొన్ని ప్యాకెట్‌లు దుర్వాసన రావడం లేదని, ఈ పాలను వేడి చేస్తే బిల్లబిల్లలుగా విడిపోయి ఆ తరువాత దుర్వాసన రావడం మొదలవుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఆరు నెలలుగా ఈ ఇబ్బంది పడుతున్నా ఏవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

నా దృష్టికి వచ్చింది
అమృత పథకం ద్వారా సరఫరా అవుతున్న పాలు నాసిరకంగా ఉంటున్నాయనే విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందించాం. ప్యాకెట్‌ ఉబ్బి ఉన్నా, దుర్వాసన వస్తున్నా ఆ పాలను కంపెనీకి తిరిగి అప్పగించేయవచ్చు. ఆ స్థానంలో మార్కెట్‌లో వేరే పాలను కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని అంగన్ వాడీ కార్యకర్తలకు సూచించాం.
- కె.కృష్ణకుమారి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ
 

మరిన్ని వార్తలు