సోమశిలకు మళ్లీ వరద

14 Sep, 2016 23:10 IST|Sakshi
సోమశిలకు మళ్లీ వరద
 
  •  5500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
 
సోమశిల: సోమశిల జలాశయం పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయానికి మళ్లీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయానికి బుధవారం 5500 క్యూసెక్కుల వంతున ప్రవాహం వచ్చి చేరుతోంది. రెండు వేల క్యూసెక్కుల వంతున రెండు రోజులు క్రితం మొదలైన వరద అంచలంచెలుగా పెరుగుతోంది. వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు వద్ద ఉదయం ఆరు వేల క్యూసెక్కుల వంతున ప్రవహించిన వరద, సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులుగా నమోదైంది. జలాశయంలో నీటి నిల్వ 14.304 టీఎంసీలకు చేరుకుంది. మరో టీఎంసీ వరకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 85.92 మీటర్లు, 281.89 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు 500 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.
20 వరకు రెండో పంటకు నీరు
జిల్లాలో రెండో పంటకు ఈ నెల 20 వరకు జలాశయం నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. జిల్లా సాగునీటి సలహా మండలిలో తీసుకున్న నిర<యం మేరకు 1.75 లక్షల ఎకరాలతో పాటు అదనంగా సాగునీటి శాఖ మరో 50 వేల ఎకరాలను గుర్తించింది. గత నెల్లో జలాశయంలో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరుతున్నా, రైతులకు నష్టం వాటిల్లకూడదనే ఆలోచనతో సాగునీటిని అందించాలని నిర్ణయించారు. అనూహ్యంగా పైతట్టు ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల దాదాపు 8 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ఇప్పటి వరకు రెండో పంటకు 23.5 టీఎంసీలను విడుదల చేయగా, మరో 0.5 టీఎంసీల వరకు ఇచ్చే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం.
మరిన్ని వార్తలు