వినూత్న నిరసన!

12 Dec, 2016 15:20 IST|Sakshi
 టెక్కలి : గ్రానైట్ పరిశ్రమలపై ప్రభుత్వం పెంచిన సీనరేజ్ ధరల తగ్గించాలంటూ యజమానులు, కార్మికులు చేపట్టిన ఆందోళన శనివారం కొత్త పుంతలు తొక్కింది. ఓ వైపు శాంతియుత ఉద్యమం చేస్తూనే ఉధృతం చేయాలని కొందరు చేసిన సూచనల నేపథ్యంలో యజమానుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...సీనరేజ్ తగ్గించాలంటూ టెక్కలి మైన్ కార్యాలయం ఎదుట ఉత్తరాంధ్ర గ్రానైట్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కోత మురళీధర్, శ్రీనివాస్, రామకృష్ణతో పాటు కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపేందుకు పాత జాతీయ రహదారిపై వాహనాలను తుడిచేందుకు సిద్ధమయ్యారు. 
 
 ఈ సమయంలో అంతా రోడ్డుపైకి వచ్చి ఓ బస్సును ఆపి తుడిచేందుకు సిద్ధం కాగా అసోసియేషన్ ప్రతినిధి చింతాడ గణపతితో పాటు కొందరు కార్మికులు రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపేందుకు యత్నించారు. దీంతో నిరసన ఉధృత రూపం దాల్చింది. పెంచిన సీనరేజ్ ధరలు తక్షణమే తగ్గించాలని, ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలని చింతాడ గణపతితో పాటు పలువురు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తే మన సమస్యలు పరిష్కారం కావని తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేయాలని గణపతి పట్టుబట్టారు. కార్మికులంతా రోడ్డున పడి ఇబ్బందులు పడుతుంటే కార్మిక మంత్రి కనీసం స్పందించకపోవడం ఆయన చేతకానితనమని గణపతి మండిపడ్డారు.
 
  శాంతియుత నిరసనలో ఎటువంటి ఉద్రిక్తతకు అవకాశం ఇవ్వొద్దంటూ కొందరు అడ్డుతగిలారు. దీంతో వారి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ సమయంలో గణపతి, మరో ప్రతినిధి నగేష్‌కు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తోటి సభ్యులు సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. మిగిలిన ప్రతినిధులు వారికి సర్దిచెప్పి దీక్షా శిబిరంలోకి తీసుకువెళ్లడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం అధ్యక్షుడు కోత మురళీధర్ మాట్లాడుతూ గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులంతా శాంతియుతంగా పోరాటం చేయాలని సూచించారు. 
 
మరిన్ని వార్తలు