రైతుకు అందని... పెట్టుబడి రాయితీ

29 Jun, 2017 03:09 IST|Sakshi
రైతుకు అందని... పెట్టుబడి రాయితీ
- మూడు తుపాన్ల సొమ్ముల ప్రభుత్వం వద్దే
- హెలిన్‌..భారీ వర్షాల పెట్టుబడి రాయితీ ఇవ్వనంటున్న బాబు సర్కార్‌ 
- రెండేళ్ల క్రితం తుపాను రాయితీ కూడా అందని తీరు
- పెట్టుబడుల కోసం మళ్లీ బయట అప్పులే
- కోనసీమలో రైతుల ఆందోళన 
అమలాపురం : ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్ల రూపాయిల పెట్టుబడి రాయితీ సొమ్ములు హామీలకే పరిమితమైంది. తుపాన్లు రావడం.. పంట నష్టపోవడం.. ఆనక కనీసం పెట్టుబడి రాయితీ సొమ్ములు కూడా రాకపోవడం రైతులకు పరిపాటిగా మారింది. పంట నష్టపోతే పరిహారం భరోసా లేకపోవడం వల్లే డెల్టాలో ముంపు ప్రాంత రైతులు ఖరీఫ్‌ సాగుకు దూరంగా ఉంటున్నారు. 
జిల్లాలో గడిచిన ఆరేళ్లలో మూడుసార్లు భారీ తుపాన్లు వచ్చి రైతులు రూ.వందల కోట్ల రూపాయిల పంటను కోల్పోయారు. ఆయా సందర్భాలలో సందర్భాలలో ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు సర్వేలు చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో హెలెన్‌ తో పాటు భారీ వర్షాలు కారణంగా  జిల్లాలో వరితోపాటు వాణిజ్య, కూరగాయ పంటలను రైతులు ఎక్కువగా నష్టపోయారు. హెలెన్‌కు సంబంధించి 1.23 లక్షల మంది రైతులకు రూ.53 కోట్లు, 2013లో భారీ వర్షాలకు సంబంధించి 1.50 లక్షల మంది రైతులకు రూ.71 కోట్లు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ రావాల్సి ఉంది. అంతకుముందు నీలం పరిహారం 3.09 లక్షల మంది రైతులకు రూ.144 మంజూరైనా ఇప్పటికీ సుమారు 12 వేల మందికి రూ.ఆరు కోట్లు చెల్లించాల్సి ఉండడం గమనార్హం. వీటికి సంబంధించి అప్పట్లో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ రాష్ట్ర విభజన తరువాత ఎన్నికలు రావడంతో జీవో జారీ చేయలేదు. కొత్త రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ ప్రచారంలో పెట్టుబడి రాయితీని అటకెక్కించింది. ఉమ్మడి రాష్ట్రంలో పరిహారం ఇప్పుడెలా ఇస్తామంటూ కొత్తపల్లవి అందుకుంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తరువాత 2015–16 తుపాను పరిహారం రూ.162 కోట్లు వరకు జిల్లాకు పెట్టుబడి రాయితీ రూపంలో చెల్లించాల్సి ఉంది. ఈ పరిహారాన్ని జూన్‌ 20 నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. తీరా గత ఏడాది కరువు పరిహారం ఇస్తామని చెప్పి అంతకుముందు ఏటా తుపాను పరిహారాన్ని అటకెక్కించే యత్నం చేయడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాబు ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాయితీగా రైతులకు అందకపోవడం విశేషం. 
సాధారణం పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వకూడదని, తరువాత పంటను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి రాయితీగా సొమ్ములు చెల్లిస్తారు. పంట తరువాత పంటకు అటుంచి ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా రైతులను గాలికి వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కనీసం పాత బకాయిలన్నా సాగు ఆరంభానికి ముందు ఇస్తే ఖరీఫ్‌కు కొంత వరకు పెట్టుబడి సొమ్ములు వస్తాయని ఆశించిన రైతులు ప్రభుత్వం మరోసారి నిరాశ పరిచింది. దీంతో వారు బయట అప్పులు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ ఉన్న రైతులకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వకూడదనే జీవో ఇచ్చి రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే. 
రైతులు ఆందోళనలు...
పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌) ఆధ్వర్యంలో రైతులు బుధవారం కోనసీమలో ఆందోళన చేపట్టారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంతోపాటు కోనసీమలోని 16 తహసీల్దారు కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద బీకేఎస్‌ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీ, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావులు నాయకత్వం వహించారు. పెట్టుబడి రాయితీలను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రైతులను అడుగడుగునా మోసం చేస్తోందని విమర్శించారు. రైతు సంఘం నాయకులు అప్పారి చిన వెంకటరమణ, అడ్డాల గోపాలకృష్ణ, రేకపల్లి ప్రసాద్, అబ్బిరెడ్డి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు