స్ఫూర్తి స్వరాలు..చైతన్య గీతికలు

23 Jan, 2017 22:57 IST|Sakshi
స్ఫూర్తి స్వరాలు..చైతన్య గీతికలు
- అలరించిన నందినాటకోత్సవాలు
- నటనకు జీవం పోసిన బాలలు
- సామాజిక రుగ్మతలను రూపుమాపే ఇతివృత్తాలు
 
కర్నూలు(హాస్పిటల్‌): ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో స్థానిక సి.క్యాంపులోని టిజివి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నంది నాటకోత్సవాలు సోమవారానికి ఆరోరోజుకు చేరుకున్నాయి. ఆదివారం లాగే సోమవారం సైతం బాలల నాటికలే ప్రదర్శించారు. పవిత్ర భారత దేశాన్ని కులమత, వర్గ, వర్ణ విభేదాల నుంచి ఎలా రక్షించుకోవాలని చెప్పే ‘పవిత్ర భారతదేశం’. భావి భారత నిర్మాతలు ఉపాధ్యాయులే అని చెప్పే ‘సత్యస్వరాలు’. చిన్ననాటి స్నేహాన్ని ఎంత ఎత్తుకు ఎదిగినా మరిచిపోకుండా ఉండే ‘స్ఫూర్తి’ నాటిక, ఓ చిన్న నాటకం ద్వారా చెడు అలవాట్లకు బానిసైన తండ్రిని సన్మార్గంలో పెట్టే కుమారుని కథ ‘స్వయంకృతం’ ప్రేక్షకులను అలరించాయి. సామాజిక అంశాల ఇతివృత్తాలతో రచించిన ఈ నాటికలు అటు పిల్లలనే కాదు పెద్దలనూ ఆలోచింపజేస్తున్నాయి. 
 
పవిత్ర భారతదేశాన్ని రక్షించుకుందాం
ఎందరో అమరవీరుల త్యాగఫలమే ఈ దేశం. అయితే కొందురు స్వార్థం కోసం, వారి అవసరాల కోసం ఈ దేశాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఇందులో కొన్ని కోట్ల ప్రజలు బలైపోతున్నారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ సమానమే అనేదే  ‘పవిత్ర భారత దేశం’ నాటిక ఇతివృత్తం. ఈ నాటికకు రచన, దర్శకత్వం సుంకరి శరత్‌(సిద్ధిపేట), నిర్వహణ శ్రీమాలి ఎడ్యుకేషనల్‌ సొసైటీ(సిద్ధిపేట). సంగీతం వర్మ, మేకప్, కాస్ట్యూమ్స్‌ డి. ప్రశాంతి. పాత్రల్లో కీర్తి, శ్రావ్య, సనా, లాస్య, భార్గవి, నవ్య హృద్యంగా నటించారు. 
 
భావిభారత నిర్మాతలు ఉపాధ్యాయులే..
కుల, మత, ప్రాంతీయ, వర్గ విషబీజాలను బాల్యంలోనే తొలగించాలనది ‘సత్యస్వరాలు’ నాటిక ఇతివృత్తం. మనుషులంతా ఒక్కటేనన్న సత్యభావనను పాఠశాల స్థాయిలోనే బాలలకు కలిగించాలని..ఇందుకు ఉపాధ్యాయులు నడుంబిగించాలనేది ఇందలో సందేశం. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నందలూరు మండలంలోని స్వర్ణాంధ్ర కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ బాలల సాంఘిక నాటికను ప్రదర్శించారు. రచయిత భారతుల రామకృష్ణ , దర్శకత్వం హస్తవరం ఆనందకుమార్, సంగీతం పీడీ ప్రసాద్, పాత్రదారులుగా ఎస్‌. విష్ణుదుర్గారెడ్డి, ఎం. శివనారాయణ, కె. కమలనాథ్‌యాదవ్, ఆర్‌. ధర్మేంద్రసింగ్, ఎస్‌. హాసిఫ్‌అల్లి, జి. దినేష్, సీఎస్‌.శశిధర్‌ తదితరులు నటించారు. నాటకం వేపగుంట సాంరాజ్‌ పర్యవేక్షణలో జరిగింది.
 
రెండు కుటుంబాల కథ ‘స్ఫూర్తి’
ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. ఒక కుటుంబం పేదది. తండ్రి ప్రమాదంలో మరణిస్తే తల్లి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి కుమారున్ని ఉన్నతంగా చదివించి కలెక్టర్‌ను చేస్తుంది. ఇక రెండో కుటుంబం జమీందారి కుటుంబం. తండ్రి డబ్బు అహంకారంతో పేదపిల్లలతో స్నేహానికి కూడా తన కుమారున్ని ఒప్పుకోని మనస్తత్వం కలవాడు. ఆయన భార్య మహాస్వాధ్వి. వీరి కుమారుడు బాగా చదువుకుంటాడు కానీ డబ్బు వల్ల దురలవాట్లకు లోనై చివరకు మెకానిక్‌గా జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. తాను చదువుకున్న పాఠశాల ఉండే జిల్లాకే సోము కలెక్టర్‌గా వస్తాడు. అక్కడి ఉపాధ్యాయులే ఆయనను సన్మానిస్తారు.
 
అక్కడే మెకానిక్‌ జీవితాన్ని అనుభవిస్తున్న తన చిన్ననాటి మిత్రుడు రవికి(జమీందారి కుమారుడు) తన చెల్లినిచ్చి వివాహం చేస్తాడు కలెక్టర్‌. స్నేహానికి చక్కని నిర్వచనాన్ని ఇచ్చే ఈ ‘స్ఫూర్తి’ నాటికను పాలేం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించారు. రచన డి. పార్వతమ్మ, దర్శకత్వం బి.బ్రహ్మచారి, పర్యవేక్షణ గాడి సురేందర్, కూర్పు పల్లెగోపాల్, పాత్రదారులుగా రాజేశ్వరి, దక్షిత, కళ్యాణి, మహేశ్వరి, మణికుమార్, అరుణజ్యోతి, విజయ్, స్వప్న, బాలీశ్వరి, శివకుమార్‌ తదితరులు బాగా నటించారు.
 
తండ్రిని సన్మార్గంలో పెట్టే కొడుకు కథ ‘స్వయంకృతం’
నేటి బాలలే రేపటి పౌరులు అనేది దేశానికే కాదు ప్రపంచానికే అవసరమైన  నినాదం. నిజానికి మంచిపౌరులుగా బాలలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపైనా ఉంది. ఒక కుటుంబాన్ని తీసుకుని తల్లిదండ్రులు బాధ్యత కోల్పోయి సోమరులుగా ఉంటే పిల్లలు ఏ విధంగా చెడిపోతారో తండ్రి పాత్రలో నటించిన పరశురాం ఒదిగిపోయారు. సోమరిగా, తాగుబోతుగా ఉన్న తండ్రిని ఓ చిన్న నాటకం ద్వారా కుమారుడు మేల్కొలిపే సన్నిశేశం ఆలోచింపజేస్తుంది. తద్వారా తండ్రి తన తప్పు తెలుసుకోవడమే గాక సమాజంలోని తల్లిదండ్రులకు మేలుకొలుపుగా సందేశాన్ని ఇచ్చారు మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కర్నూలులోని జ్ఞాన వికాస భారతి వారి స్వయంకృతం బాలల నాటికలో. రచన బి.సోమయ్య, దర్శకత్వం జి. బ్రహ్మాచారి, సంగీత సహకారం ప్రసాదాచారి, ఆర్గనైజర్‌ ఎం. జంగయ్య. పాత్రదారులుగా దేవి, నూతనసాయి, ఇక్ష్వాక్, మణి, విజయ్, బాలీశ్వరి నటించారు. 
 
నేటి ప్రదర్శనలు..
ఉదయం 9 గంటలకు ఈటెల నాటక రంగ కళాకారుల సమాఖ్య వారి ‘కొత్తబానిసలు’, ఉదయం 10.30 గంటలకు అమెచ్యూర్‌ ఆర్ట్స్‌ వారి ‘మార్గదర్శి’. మధ్యాహ్నం 12 గంటలకు మహతి క్రియేషన్స్‌ వారి ‘నియతి, మధ్యాహ్నం 2 గంటలకు మహతి క్రియేషన్స్‌ వారి ‘మిస్టరీ’, సాయంత్రం 4.30 గంటలకు సత్కళాభారతి వారి ‘నాయకురాలు నాగమ్మ(సాంఘిక నాటకం), రాత్రి 7 గంటలకు కళారాధన (నంద్యాల) వారి ‘సైకత శిల్పం’ నాటికలు ప్రదర్శిస్తారని ఎఫ్‌డీసీ మేనేజర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు