వెళ్తున్నా..వెళ్తున్నా..

5 May, 2017 03:31 IST|Sakshi
వెళ్తున్నా..వెళ్తున్నా..

విశాఖకు తరలిపోయిన పెట్రో యూనివర్శిటీ, అదే బాటలో ఐఐఎఫ్‌టీ  
రావల్సిన మరో మూడు పరిశ్రమలపైనా నీలినీడలు
నేతల నిర్లక్ష్యంతో ఇతర జిల్లాలకు తరలింపు
విశాఖకు ఎగరేసుకుపోయే ప్రయత్నాలు
ఆపేందుకు ప్రయత్నాలు శూన్యం


జిల్లాకు రావల్సినవి కొత్త రెక్కలు కట్టుకొని ఇతర జిల్లాకు తరలిపోతున్నాయి. జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో కొరవడిన చిత్తశుద్ధి ఫలితంగా ఈ పరిస్థితి నెలకుంది. పర్సెంటేజీలు వస్తాయంటే చాలు ఆహ్వానించే నేతలున్న ఈ జిల్లా నేతలు విద్యార్థిలోకానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే సంస్థలు తరలిపోతున్నా కనీసం చీమకుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని విద్యావేత్తలు ఆవేదన ‍వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రగతిలో ముందుంటామని గొప్పలకుపోయే పాలకులు అరుదైన అవకాశాలను చేజార్చేస్తున్నారు. ఆర్థికంగా కలిసి వస్తుందంటే చాలు గద్దల్లా వాలిపోయే నేతలు ... తనకు కలిసి రాదంటే కన్నెత్తి కూడా చూడని దుస్థితి. విద్యార్థి లోకానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే అరుదైన ఇనిస్టిట్యూట్లు సరిహద్దులు దాటిపోతున్నా చీమకుట్టినట్టయినా లేదు. వీరి నిర్వాకంతో జిల్లాకు వచ్చిన మరో అరుదైన అవకాశం చేజారిపోయేలా కనిపిస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం జిల్లాకు పలు ఇనిస్టిట్యూట్లను మంజూరు చేసింది. ఇందులో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ఒకటి. ఆ ఇనిస్టిట్యూట్‌ను రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లాకు వచ్చేట్టు చేయాల్సిన జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. చంద్రబాబు కేబినెట్‌లో నంబర్‌-2గా చెప్పుకునే మంత్రి యనమలతోపాటు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కనీసం ఈ సంస్థ ఏర్పాటుపై చేసిన ప్రయత్నం ఏమీ లేదు. విభజన తరువాత ప్రతిష్టాత్మకంగా భావించిన పెట్రో యూనివర్సిటీ జిల్లాకు మంజూరైంది. కృష్ణా గోదావరి బేసిన్‌లో కీలకమైన కోనసీమలో అపారమైన చమురు, సహజవాయువు నిక్షేపాలు వెలికి తీస్తున్న క్రమంలో పెట్రో యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటైతే జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయనుకున్నారు. పెట్రోలియం రంగంలో శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలకు ఒక మార్గదర్శకంగా òపెట్రో యూనివర్సిటీ నిలుస్తుందని విద్యార్థి లోకం ఆశలు పెంచుకుంది.

ఎంతో ఉపయోగకరం పెట్రో యూనివర్శిటీ...
కొన్ని పరిశ్రమ కోసం ప్రజలు వద్దన్నా ప్రభుత్వమే బలవంతంగా వందల ఎకరాలను సేకరిస్తోంది. తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తాయంటే పోలీసులను ఉసిగొల్పి కాలుష్య పరిశ్రమలైనా రప్పించుకుంటున్నాయి. అటువంటిది కేవలం 87 ఎకరాలు భూ సేకరణ చేస్తే సరిపోయే పెట్రో యూనివర్సిటీని గాలికొదిలేశారు. రాజమహేంద్రవరం, కాకినాడ, రాజానగరం, మండపేట తదితర ప్రాంతాల్లో పెట్రో యూనివర్సిటీ ఏర్పాటుకు కమిటీ పరిశీలన జరిపింది. అప్పుడు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం చొరవ తీసుకోకపోవడంతోనే ఆ యూనివర్సిటీ విశాఖ జిల్లాకు అక్కడి ప్రజాప్రతినిధులు ఎగరేసుకుపోయారు. అలా ప్రతిష్టాత్మక పెట్రో యూనివర్సిటీని జిల్లా నుంచి చేజారిపోగా, ఇప్పుడు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ అదే బాటలో పయనిస్తోంది. ఈ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర పరిశీలన కమిటీ గత ఏడాది రాజమహేంద్రవరం, మండపేట, రాజానగరం పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రభుత్వ అసైన్ఢ్‌ భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఐఐఎఫ్‌టీతోపాటు లాజిస్టిక్‌ వర్సిటీ, ఇండస్ట్రియల్‌ పార్కు, కొబ్బరి ఆధారిత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, జీడిపప్పు పరిశ్రమల ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటిలో ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలంగా ఉంటుందని సెర్చ్‌ కమిటీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఆ కమిటీని కలిసి ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటుపై కనీసం జిల్లా ప్రజాప్రతినిధులు ఒక్కసారి కూడా చర్చించకపోవడం వారి చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోంది. గతంలో పెట్రో యూనివర్సిటీ విషయంలో నిర్లక్ష్యం వహించిన రీతిలోనే ఇప్పుడు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ విషయాన్ని కూడా పాలకులు గాలికొదిలేశారు.

ఆ మంత్రులకున్న చిత్తశుద్ధి వీరికేదీ...?
విభజన అనంతరం రాజధానిగా మంగళగిరి ఏర్పాటయ్యాక పారిశ్రామికంగా విశాఖపట్నంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న పలుకుబడిని వినియోగించి ఈ ఇనిస్టిట్యూట్‌ను విశాఖకు తరలించేందుకు విశాఖ ఎంపీ హరిబాబు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. ఇద్దరు రాష్ట్ర మంత్రులు, ముగ్గురు ఎంపీలు మురళీమోహన్, తోట నరసింహం, పండుల రవీంద్ర అధికార పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా విద్యా సంస్థలు, పరిశ్రమలు తరలిపోకుండా అడ్డుకుంటారనే నమ్మకం జిల్లా ప్రజలకు కలగడం లేదు. వీటి ఏర్పాటుపై నియమితమైన సెర్చ్‌ కమిటీ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అనువుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. సహజంగా రాజమహేంద్రవరం అనే సరికి అక్కడి ఎంపీ మురళీమోహన్‌ కీలకమైన పాత్ర పోషించాలి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మురళీమోహన్‌ గట్టి ప్రయత్నం చేస్తే ఐఐఎఫ్‌టి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే ఈ సరికే ఏర్పాటయ్యేది. కాకినాడ ఎంపీ తోట నరసింహం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పలు స్టాండింగ్‌ కమిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్యాధికుడిగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు కూడా ఆ స్థాయిలో వీటి కోసం ప్రయత్నం చేయడం లేదనే విమర్శలున్నాయి.

ఐఐఎఫ్‌టీ ప్రయోజనాలెన్నో...
ఈ ఇనిస్టిట్యూట్‌ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో 1963లో ఏర్పాటైంది. మానవ వనరుల అభివృద్ధిని విశ్లేషించడం, నిరంతరం పరిశోధనలు నిర్వహించడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించాలనేది సంస్థ ప్రధాన లక్ష్యం. విదేశీ వాణిజ్యం నిర్వహణ, పెరుగుదల, ఎగుమతులను పెంపొందించాలనే లక్ష్యాలు కూడా ఇందులో ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయీకరణకు దోహదపడేలా సరికొత్త ఆలోచనలు, నైపుణ్యాభివృద్ది, కార్పొరేట్, ప్రభుత్వ రంగంలో పరిశోధన ఆధారిత కన్సల్టెన్సీని అందించే సామర్థ్యం కలిగిన ఇనిస్టిట్యూట్‌ ఇది. నిరంతర పరిశోధన, కన్సల్టెన్సీల ద్వారా ప్రభుత్వం వాణిజ్య, పరిశ్రమ అవసరాల కోసం ఎప్పటికప్పుడు విజ్ఞానం ఆ«ధారంగా  సేవలందిస్తుంది. ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్స్, కెరీర్‌ నిపుణుల ఆకాంక్షలకు అనుగుణంగా కోర్సులు అందిస్తుండటంతో విదేశీ విద్యార్థులు కూడా ఆకర్షితులవుతారు.

‘ఐఐఎఫ్‌టీకి రాజమహేంద్రవరం అనుకూలం
ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)  ఏర్పాటుకు అన్ని విధాలా రాజమహేంద్రవరం అనుకూలమైనది. విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం ఐఐఎఫ్‌టీతో మరింత ప్రగతిని సాధించడంతోపాటు ఏటా సుమారు రూ. వంద కోట్ల మేరకు వ్యాపార లావేదేవీలు జరగడానికి, సుమారు 300 మందికి ఉద్యోగావకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. ఓఎన్‌జీసీ, గెయిల్‌ వంటి సంస్థలు కూడా ఇక్కడనే ఉన్నందున ఐఐఎఫ్‌టీని కూడా రాజమహేంద్రవరంలోనే ఏర్పాటుచేయడం సముచితం.   
- ఆచార్య ఎస్‌. టేకి, డీన్,  ఆదికవి నన్నయ యూనివర్సిటీ, రాజానగరం.

ఉపాధి అవకాశాలు కోల్పోనున్న స్థానికులు
నవ్యాంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారన్‌ ట్రేడ్‌ పరిశ్రమ రావడంపై హర్షం వ్యక్తం చేశాం. ఇప్పటికీ దాని కార్యాచరణ తెలపకపోగా ప్రస్తుతం అది కూడా ఇతర జిల్లాకు తరలిపోతున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మన జిల్లా నేతలు ఉన్న కారణంగా పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాం. జిల్లాలో సాంకేతిక విద్యతోపాటు మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన అభ్యర్థులు వేలాది మంది ఉన్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు వస్తాయి.
- బి.ప్రభాకరరావు, జేఎన్‌టీయుకే రెక్టార్‌

పరిశ్రమ ఇక్కడే ఏర్పాటు చేయాలి
జిల్లాలో సాంకేతిక యూనివర్సిటీ జేఎన్‌టీయుకేతోపాటు నన్నయ్యవంటి వర్సిటీలు ఉన్న నేపథ్యంలో పరిశ్రమలు కూడా ఏర్పడితే జిల్లా అభివృద్ధితోపాటు పరిశ్రమలకు తగ్గ మ్యాన్‌ పవర్‌ను వర్సిటీల నుంచి తీసుకోవచ్చు. గతంలో జిల్లాకు పెట్రోలియం వర్సిటీ మంజూరు కాగా తరగతులను జేఎన్‌టీయుకేలో నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించగా, పెట్రో యూనివర్సిటీ ఇతర జిల్లాకు తరలించారు. ఈ పరిశ్రమ కూడా అ విధంగా చేజారకుండా చూడాలి.
-ఎ.గోపాలకృష్ణ, డిజైన్‌ ఇన్నోవేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ డైరెక్టర్, జేఎన్‌టీయుకే

ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి...
పెట్రోలియం యూనివర్శిటీ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు స్థానికంగా ఏర్పాటైతే మన జిల్లాకు చెందిన యువతకు కొంత వరకు ఉపాధి అవకాశాల ప్రయోజనం ఉంటుంది. స్థానికంగా చమురు సంస్థలు ఉన్నందున ఆయా కంపెనీల్లో పనిచేసేందుకు అవసరమైన నైపుణ్యం యువతకు వస్తే వారి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అటువంటి యూవర్శిటీని జిల్లాకు వచ్చినట్టే వచ్చి పోవడం దురదృష్టకరం.
– మట్టపర్తి రవిశంకర్, బీటెక్‌ , గంగలకుర్రు అగ్రహారం, అంబాజీపేట

నేతలకు చిత్తశుద్ధి లేక పోవడం వల్లే...
మన జిల్లా నేతలకు అభివృద్ధిపైనా..యువతకు మేలు చేసే యూనివర్శిటీల సాధన, జిల్లా పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చిత్తశుద్ధి లేదు. ఈ కారణంగానే జిల్లాకు మంజూరైనా పెట్రోలియం యూనివర్శిటీ, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫారన్‌ ట్రేడింగ్‌ వంటివి పక్క జిల్లాలకు వెళ్లిపోతున్నాయి. నేతలు ఇప్పటికైనా స్పందించి ఇటువంటివి సాధించడం ద్వారా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి.
 – బండారు రామ్మోహనరావు, ఓయూ పూర్వవిద్యార్థుల సంఘం, అమలాపురం.

మరిన్ని వార్తలు