వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

14 Sep, 2016 22:27 IST|Sakshi
apasruthi
- పాకల సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతు
- ఒకరు మృతి.. నలుగురిని రక్షించిన  మెరైన్‌ కానిస్టేబుల్‌ 
- మృతునిది పొన్నలూరు మండల కేంద్రం 
పాకల (సింగరాయకొండ) : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా నలుగురిని మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన పాకల సముద్ర తీరంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం సింగరాయకొండ, కందుకూరు, జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి మండలాల నుంచి భక్తులు పాకల సముద్ర తీరానికి బుధవారం విరివిగా వచ్చారు. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రజలను సముద్రంలోకి వెళ్లకుండా సీఐ భీమానాయక్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పొన్నలూరుకు చెందిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు రెండు ట్రాక్టర్లలో వచ్చి సముద్రంలో నిమజ్జనం చేశారు. విగ్రహం ఒడ్డునే ఉండటంతో సముద్రం లోపలికి నెట్టే ప్రయత్నంలో ఉండగా ఐదుగురు యువకులు అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయారు. సీఐ భీమానాయక్‌ అప్రమత్తమై మెరైన్‌ కానిస్టేబుళ్లను అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్‌ కె.రామకృష్ణ సముద్రంలో గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రయత్నించి చివరకు ఆయన కూడా ప్రమాదంలో పడ్డారు. వెంటనే మరో మెరైన్‌ కానిస్టేబుల్‌ కె.ధనుంజయ లైఫ్‌ జాకెట్ల సాయంతో సముద్రంలోకి వెళ్లి రామకృష్ణతో పాటు నలుగురు యువకులను రక్షించారు. పొన్నలూరుకు చెందిన లింగంగుంట రమేష్‌ (42)ను ఒడ్డుకు తీసుకొచ్చినా అప్పటికే బాగా నీరు తాగి ఉండటంతో చనిపోయాడు. మరో యువకుడు కొత్తకోట మాధవ (35) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే 108లో సింగరాయకొండ ప్రభుత్వ అస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మిగిలిన ముగ్గురు స్వయంపాకుల మణికంఠ, చెన్నయపాలెం మల్లికార్జున, ఎన్‌.విజయ్‌లు వెంటనే తేరుకున్నారు. ఆ తర్వాత నుంచి తీరం ఒడ్డునే నిమజ్జనాలు చేసేలా ఎస్సై వైవీ రమణయ్య చర్యలు తీసుకున్నారు. విషయం తెలిసి తహసీల్దార్‌ షేక్‌ దావూద్‌హుస్సేన్‌ హుటాహుటిన తన సిబ్బందితో పాకల తీరానికి వెళ్లి పోలీసు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. 
పొన్నలూరులో.. 
పొన్నలూరు : స్థానికంగా నివాసం ఉండే రజకులు వినాయక విగ్రహం నిమజ్జనం కోసం రెండు ట్రాక్టర్లలో పాకల సముద్ర తీరానికి వెళ్లారు. అలల ధాటికి రమేష్‌ గల్లంతై మృతి చెందడంతో భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు బేల్దారి పనుల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. భార్య రమణమ్మ కూలి పనులు వెళ్తూ ఇద్దరు కొడుకులు వెంకటసాయి, బాలసాయిలను చదివించుకుంటూ ఇంటి వద్దే ఉంటోంది. వినాయక నిమజ్జనం కోసం రమేష్‌.. హైదరాబాద్‌ నుంచి మంగళవారం స్వగ్రామం వచ్చాడు. వినాయక లడ్డూను వేలం పాటపడి దక్కించుకున్నాడు. ఆ రాత్రి తన బంధువులకు ఇంటి వద్ద విందు ఇచ్చి వారితో సంతోషంగా గడిపాడు. రాత్రి గ్రామంలో జరిగిన వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్నాడు. నిమజ్జనానికి వెళ్లొద్దని భార్య బతిమాలినా వినిపించుకోకుండా వెళ్లి రమేష్‌ ప్రాణాలు కోల్పోయాడు. 
కాలనీలో విషాద ఛాయలు 
రాత్రంతా తమతో పాటు వినాయక ఊరేగింపులో పాల్గొన్న రమేష్‌ సముద్రంలో మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లముందే అలల మధ్య కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేకపోయామని కాలనీ వాసులు వాపోయారు.పోలీసులు వెంటనే స్పందించకుంటే మిగిలిన నలుగురినీ కోల్పోవాల్సి వచ్చేదని భయాందోళన వ్యక్తం చేశారు. 
 
మరిన్ని వార్తలు