ఇంటర్‌ వార్షిక పరీక్షలకు రెడీ

26 Feb, 2017 04:52 IST|Sakshi

► హాజరుకానున్న 48,500 మంది విద్యార్థులు
► ఉదయం 9గంటలు దాటితే అనుమతి ఉండదు

విద్యారణ్యపురి : వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరగనుండగా కేంద్రాల గుర్తింపు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లతో పాటు ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేసినట్లు ఇంటర్‌ విద్య డీఐఈఓ కే.వీ.ఆజాద్‌ తెలిపారు.

56 కేంద్రాల్లో ఏర్పాట్లు
ఇంటర్‌ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 56 పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి  మొత్తంగా 48,500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 56మంది చీఫ్‌ సూపరింటిండెంట్లు, 56మంది డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లతో పాటు ఇన్విజిలేటర్లను నియమించారు. అంతేకాకుండా పరీక్షల నిర్వహణ తీరు పరిశీలనకు మూడు ఫ్లయింగ్‌ స్క్వాడ్లతో పాటు నాలుగు సిట్టింగ్‌ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. ఇంకా ఓ హైపవర్‌ కమిటీని కూడా ఏర్పాటుచేశామని డీఐఈఓ ఆజాద్‌ వివరించారు.

దిహేను నిమిషాల ముందే రావాలి..
ఇంటర్‌ పరీక్షలు నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతాయి. ఈ మేరకు విద్యార్థులు నిరే్ధశించిన సమయానికి పదిహేను నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే, నిర్ణీత సమయమైన ఉదయం 9గంటలు దాటాక ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని డీవీఈఓ స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే విద్యార్థుల హాల్‌టికెట్లు కూడా కళాశాలలకు పంపించామని, అక్కడి తీసుకోవాలని ఆయన సూచించారు.
 

మరిన్ని వార్తలు