‘చీకటి’ పరీక్షలు!

1 Mar, 2017 23:13 IST|Sakshi
‘చీకటి’ పరీక్షలు!

–అసౌకర్యాల నడుమ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం
- మొదటిరోజు 1,333 మంది గైర్హాజర్‌

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ పరీక్షలు బుధవారం అసౌకర్యాల నడుమ ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో గాలి, వెలుతురు, ఫర్నీచర్‌ కచ్చితంగా ఉండాలని ఉన్నతాధికారులు పదేపదే ఆదేశించినా.. ఫలితం లేకపోయింది. కొన్ని కేంద్రాల్లో కరెంట్‌ లేక విద్యార్థులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. గతంతో పోల్చితే ఈసారి దాదాపు అన్ని సెంటర్లలో ఫర్నీచర్‌ ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మాత్రం విరిగిన బల్లలు దర్శనమిచ్చాయి. మరికొన్ని చోట్ల వాటిని శుభ్రం చేయలేదు. దుమ్మూ ధూళితో నిండిపోయాయి. విధిలేక విద్యార్థులు వాటిపైనే కూర్చుని పరీక్ష రాశారు. మొత్తమ్మీద తొలిరోజు ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగానే జరిగాయి. జనరల్‌ విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ, ఒకేషనల్‌ విద్యార్థులకు జనరల్‌ ఫౌండేషన్‌ కోర్స్‌ పరీక్షలు జరిగాయి. 

మొత్తం 36,758 మంది విద్యార్థులకు గాను 35,425 మంది హాజరయ్యారు. 1,333 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 33,885 మందికి గాను 32,761  మంది హాజరవగా.. 1,124 మంది రాలేదు. ఒకేషనల్‌ విద్యార్థులు 2,873 మందికి గాను 2,664 మంది హాజరయ్యారు. 209 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని కేఎస్‌ఆర్‌ బాలికల కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల పరీక్షా కేంద్రాలను  జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీకాంతం తనిఖీ చేశారు. అలాగే జిల్లా వృత్తి విద్యాధికారి (డీవీఈఓ) చంద్రశేఖర్‌రావు అనంతపురం, ధర్మవరంలోని కేంద్రాలను, ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్‌ఐఓ) వెంకటేశులు అనంతపురం, డీఈసీ సభ్యులు హిందూపురంలోని కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు మడకశిర, గుడిబండ, అమడగూరు, గుంతకల్లు, గుత్తి, పామిడి, గోరంట్ల, కొత్తచెరువు, ధర్మవరం, కుందుర్పి, కళ్యాణదుర్గం, ఆత్మకూరు  కేంద్రాలను తనిఖీ చేశాయి. హై పవర్‌ కమిటీ సభ్యులు ఆమడగూరు, కదిరి, తనకల్లు కేంద్రాలకు వెళ్లారు.

మరిన్ని వార్తలు