ఒంటరిగా వెళ్లింది.. జంటగా వచ్చింది

14 Sep, 2017 06:44 IST|Sakshi
శ్రీలక్ష్మి

సురక్షితంగా సత్తెనపల్లి  పోలీస్టేషన్‌కు వచ్చిన యువతి
సత్తెనపల్లి :
పట్టణంలోని వడ్డవల్లికి చెందిన యువతి రాసంశెట్టి శ్రీలక్ష్మి అదృశ్యం చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. వివరాలు ఇలా ఉన్నాయి. రామిశెట్టి అజయ్‌కుమార్, లక్ష్మిల దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఒక కుమార్తెకు వివాహం అయ్యింది. కాగా, అజయ్‌కుమార్‌ రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. లక్ష్మి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమార్తెలు ముగ్గురు ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. చివరి కుమార్తె అయిన శ్రీలక్ష్మి ఇంటర్మీడియట్‌ చదువుకుని కొంతకాలంగా ఖాళీగా ఉంటోంది. డిగ్రీ పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం చేయవచ్చుకదా అని ఆమె అక్కలు పలుమార్లు చెబుతుండేవారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలక్ష్మి గత నెల 16న రెండు పేజీల లేఖ రాసి ఇంటి నుంచి అదృశ్యమైంది.

తాను ఆత్మహత్య చేసుకుంటానని, తన శరీరం కూడా దొరకదని అందులో పేర్కొనడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గతనెల 17న పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈనెల 11న యానాం నుంచి ఫేస్‌బుక్‌ ద్వారా కుటుంబ సభ్యులకు లక్ష్మి మెసేజ్‌ పంపింది. తాను సురక్షితంగా ఉన్నానని, వివాహం చేసుకున్నట్లు తెలిపింది.  దీంతో కుటుంబ సభ్యులు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు.

పట్టణ పోలీసులకు విషయాన్ని తెలియ చేయడంతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఆధారంగా ఆచూకీని కనుగొన్నారు. శ్రీలక్ష్మి ఫేస్‌బుక్‌లో పరిచయమైన యానాం వాసి పెద్దిరెడ్డి ఈశ్వరప్రసాద్‌ వద్దకు వెళ్లిపోయింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. బుధవారం శ్రీలక్ష్మితోపాటు ఈశ్వర ప్రసాద్‌లను పోలీసులు తీసుకొని జిల్లా రూరల్‌ ఎస్పీ వెంకటప్పలనాయుడు వద్దకు తీసుకెళ్లారు. అనంతరం సత్తెనపల్లి పోలీస్టేషన్‌కు తీసుకు వచ్చారు. శ్రీలక్ష్మి సత్తెనపల్లి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలిగింది.

మరిన్ని వార్తలు