ప్రియురాలి కోసం దొంగ అవతారం

22 Apr, 2017 23:53 IST|Sakshi
ప్రియురాలి కోసం దొంగ అవతారం

- ఎట్టకేలకు పట్టుబడిన అంతర్‌రాష్ట్ర దొంగ
- 51 బైక్‌లు స్వాధీనం
- నిందితుడు గోరంట్ల మండల వాసి

ఎంతటి వాడైనా కాంతదాసుడే అంటారు. నిజమే. ప్రేమించిన అమ్మాయి కోర్కెలు తీర్చేందుకు ఓ యువకుడు దొంగ అవతారం ఎత్తాడు. అతని కాలంలోనే అంతర్‌రాష్ట్ర దొంగగా ఎదిగిపోయాడు. చివరకు పోలీసుల వలకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. చేజేతులా భవిష్యత్తును నాశనం చేసుకున్నాడు.                   

బెంగళూరు : అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పెట్లకుంటపల్లికి చెందిన మనోహర్‌ అలియాస్‌ మను అనే అంతర్‌రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు ఎట్టకేలకు వలపన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. అతని నుంచి 51 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు పోలీస్‌ అదనపు కమిషనర్‌ హేమంత్‌ నింబాళ్కర్‌ నిందితుడ్ని మీడియా ముందు శనివారం హాజరుపరిచారు. వాటి వివరాలను వివరించారు.

పరిచయం.. ప్రేమ.. సహజీవనం...
బెంగళూరులోని హొంగసంద్ర నాయుడు లేఔట్‌కు చెందిన మనోహర్‌  బొమ్మనహళ్లిలోని ఓ గార్మెంట్స్‌లో టైలర్‌గా పని చేసేవాడు. గోరంట్ల ప్రాంతానికి చెందిన ఓ యువతి కూడా అక్కడే మరో గార్మెంట్స్‌లో పని చేసేది. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సదరు యువతి సొంత ఊరికి వెళ్లిపోయింది. తిరిగి బెంగళూరు రావాలని ఆమెను మనోహర్‌ తరచూ ఫోన్‌లో కోరేవాడు. అద్దె ఇంటిని తీసుకుంటే వస్తానంటూ ఆమె షరతు పెట్టింది. చివరకు ఆమె చెప్పినట్లే హొంగసంద్రలో ఓ అద్దె గదిని తీసుకుని ప్రియురాలితో సహజీవనం చేయసాగాడు. అదే సమయంలో వచ్చే జీతంతో సంసారం సాగించడం కష్టమని భావించిన మనోహర్‌ మరోసారి దొంగ అవతారం ఎత్తాడు.

కన్నుపడితే మాయం చేసేవాడు
బైక్‌ల అపహరణలో ఆరితేరిన మనోహర్‌ బెంగళూరు రాకముందు హిందూపురం, కదిరి ప్రాంతాల్లో బైక్‌లు చోరీ చేసేవాడు. అతనిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. మడివాళ, బేగూరు, బొమ్మనహళ్లి, మధుగిరి, కొరటెగెరె, మిడగేసి, బాగేపల్లి, గుడిబండ తదితర ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసిన కేసులు నమోదై ఉన్నాయి. కన్నుపడితే చాలు క్షణాల్లో​ఆ బైక్‌ను అపహరించడం మనోహర్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అతను పోలీసులకు చిక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. దీంతో పోలీసులకు సవాల్‌గా మారాడు.

పోలీసుల వలకు చిక్కిందిలా..
కదిరి, గుడిబండ గ్యాంగ్‌ల కోసం గాలింపు చర్యలు చేపట్టిన బెంగళూరు పోలీసులు.. పాత బైక్‌లు కొంటామంటూ ప్రకటన ఇచ్చారు. దీంతో పోలీసులు ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు మనోహర్‌ పలుమార్లు ఫోన్లు చేసి సంప్రదించాడు. బొమ్మనహళ్లి పోలీసులు మారువేషంలో బైక్‌ల కొనుగోలు నెపంతో నాయుడు లేఔట్‌కు  శనివారం వెళ్లి మనోహర్‌ను పట్టుకున్నారు. అతని వద్దనున్న 51 బైక్‌లను చూసి విస్తుపోయారు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. మనోహర్‌ను వెంటనే అరెస్ట్‌ చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. ప్రియురాలి కోసమే బైక్‌ల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అయితే దొంగతనాలు చేసి ప్రియుడు తనను పోషిస్తున్నట్లు ఆ అమాయకురాలికి తెలియదు. డీసీపీ బోరలింగయ్య, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు