జోరుగా వడ్డీ దందా

5 Jul, 2017 02:08 IST|Sakshi
జోరుగా వడ్డీ దందా

చిరువ్యాపారులు, రైతులే టార్గెట్‌
రూ.3నుంచి రూ.10 వడ్డీ వసూలు
అనుమతి లేని ఫైనాన్స్‌లే అధికం

నేరడిగొండ(బోథ్‌): జిల్లాలో వడ్డీ వ్యాపారుల దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలు, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వసూలు చేస్తూ వారిని దోచుకుంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడుతున్న శ్రమజీవులకు అప్పులు ఇచ్చి అధిక వడ్డీ గుంజుతున్నారు.

పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో పాటు ఖరీఫ్‌ కూడా మొదలైంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం, రైతులు సాగు పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఇష్టారాజ్యంగా వడ్డీ వేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. తోపుడు బండ్లు, చాయ్‌ హోటళ్లు, పాన్‌షాప్లు, ఆటోరిక్షాలు, చిన్నచిన్న మెకానిక్‌ సెంటర్లను టార్గెట్‌గా చేసుకుని ఫైనాన్స్‌ వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
అవసరాలే ఆసరాగా..
ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో రైతులు పంటల పెట్టుబడుల కోసం అల్లాడిపోతున్నారు. సకాలంలో బ్యాంకుల నుంచి పంట రుణాలు అందడం లేదు. రుణమాఫీ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడంతో కొందరు, జమ అయినా బ్యాంకు నుంచి నగదు అందక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారు విధి లేక వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో చిన్నవి.. పెద్దవి కలిపి అనుమతులు పొందినవి, పొందనివి 200లకు పైగా ఫైనాన్స్‌లు ఉన్నాయి.

వీరంతా రూ.100కు రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారని బాధితుల ద్వారా తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో తమ వద్దకు వచ్చిన రైతులకు చెందిన భూముల పత్రాలను తాకట్టు పెట్టుకుంటున్నారు. ఖాళీ బాండ్‌ పేపర్ల మీద రైతులతో పాటు వారి కుటుంబ సభ్యుల సంతకాలు చేయించుకుని అప్పులు ఇస్తున్నారు. అనుమతి లేకుండా దర్జాగా ఆఫీసులను ఏర్పాటు చేసుకుని తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

రైతులకు ఇచ్చే అప్పుల్లో ముందుగానే వడ్డీలను పట్టుకుని మిగతా డబ్బులు చెల్లిస్తున్నారు. రైతులు పంటలు పండగానే మొత్తం డబ్బులను ఒకేసారి కట్టాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యమైనా ఇచ్చిన డబ్బులకు మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. అలాగే చిరు వ్యాపారులకు ఇచ్చే డబ్బుల్లోనూ ముందుగానే వడ్డీ తీసుకుని డబ్బులు చెల్లిస్తున్నారు. రోజువారీగా డబ్బులు వసూలు చేస్తుంటారు. దీంతో అప్పులు తీసుకున్న వారి నుంచి 20శాతం ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలు కూడా తమ పిల్లల చదువుల కోసం వేలాది రూపాయలు చెల్లించలేక వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్తున్నారు. వడ్డీ ఎక్కువైనా సరే అంటూ పిల్లల భవిష్యత్‌ కోసం అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీ భారాన్ని మోయలేక, తిరిగి చెల్లించలేక నానా యాతన పడుతున్నారు.
పట్టించుకునేవారేరి?
ఈ ఫైనాన్స్‌లలో చాలావరకు ప్రభుత్వ ఉద్యోగులున్నట్లు సమాచారం. జిల్లాలోని పలు చోట్ల అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని అప్పులు ఇస్తున్నారు. ప్రతీరోజు జిల్లాలో కోట్లలో వ్యాపారం సాగుతోంది. ఇంతా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖాలాలు లేవు.
లైసెన్సులు లేకుంటే చర్యలు
ఎవరైనా లైసెన్సు లేకుండా ఫైనాన్స్‌ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా అధికవడ్డీలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కేసులు నమోదు చేస్తాం. ఫైనాన్స్‌ నిర్వహించేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు కలిగి ఉండాలి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తాం.  
– వేముల చంద్రప్రభు, డీఎస్పీ, ఉట్నూర్‌

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా