అంతర పంట.. లాభాల బాట

22 Oct, 2016 00:25 IST|Sakshi
అంతర పంట.. లాభాల బాట

పెరవలి: కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తి ఆ అభ్యుదయ రైతుకు అక్షరాలా సరి పోతుంది. పట్టుదల, కృషి, నమ్మకం ఉం టే పుడమితల్లి ఆదుకుంటుందని నమ్మి లాభాలను ఆర్జిస్తున్నారు పెరవలి మండ లం ముక్కామలకు చెందిన కౌలు రైతు మాకే వీరబాబు. నాలుగెకరాల కొబ్బరి తోటలో పసుపు సాగు చేపట్టి లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సాగులో మెళకువలు ఆయన మాటల్లోనే..

పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మూడేళ్ల క్రితం నాలుగు ఎకరాల కొబ్బరి తోటను ఏడాదికి రూ.30 వేలు చొప్పున కౌలుకు తీసుకుని పసుపు సాగు చేపట్టాను. దిగుబడి ఆశించిన విధంగా ఉన్నప్పటికీ మార్కెట్టులో గిట్టుబాటు ధర లభించక రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. దీంతో పసుపు సాగుకు ముందు ఆకుకూరలను పండించాను. సీజన్‌ రాగానే పసుపు సాగు చేశాను. ఆకుకూరల ఆదాయం పెట్టుబడికి సరిపోయింది. 
పుట్టు పసుపు రూ.3 వేలు
పసుపు ఊరటానికి ముందు చేలో మూడుసార్లు దుక్కులు దున్నాను. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు 10 టన్నులు వేసి, నీరు పెట్టి విత్తనం నాటాం. అధికారులు సూచనలతో ఎరువులు వినియోగించాం. గతేడాది ఎకరానికి 50 పుట్టుల (పుట్టు అనగా 236 కిలోలు)  పసుపు ఊరింది. పచ్చిపసుపు పుట్టు రూ.3 వేలు చొప్పున అమ్మాను. నష్టాలను పూడ్చుకోగలిగాను. ప్రస్తుతం పసుపు సాగు చేపట్టాం. 
కొబ్బరితోటల్లో అనువైన విత్తనం
గోదావరి జిల్లాల్లో కస్తూరి రకం పసుపు సాగు చేస్తారు. నేను దుగ్గిరాల పసుపు వే శాను. ఈ పసుపు దిగుబడితో పాటు మార్కెట్టులో మంచి ధర లభిస్తుంది. గతేడాది పుట్టు విత్తనం పసుపు రూ.5 వేలకు కొనుగోలు చేశాను. కొబ్బరితోటల్లో దుగ్గిరాల పసుపు సాగుకు అనుకూలం. ఈ పంటకు నీడ అవసరం. ప్రస్తుతం 4 ఎకరాల్లో పసుపు సాగుకు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాతారవణం అనుకూలిస్తే ఈ ఏడాది లాభాలు వస్తాయి.
ఖర్చుతక్కువ లాభం ఎక్కువ
కొబ్బరి తోటలో పసుపు సాగుకు పెట్టుబడి తక్కువ. చేలల్లో బోదెలు తవ్వాలి. చచ్చు ఎక్కేయాలి. ఎరువులు ఎక్కువగా వినియోగించాలి. కొబ్బరి తోటలో పసుపుకి బోదెలు, చచ్చు ఎక్కేయటం వంటి పనులుండవు. దీంతో ఎకరానికి రూ.15 వేలు వరకు ఖర్చు ఆదా అవుతుంది. ఎరువుల ఖర్చుకూడా తగ్గుతుంది. చీడపీడల సమస్య పెద్దగా ఉండదు. ఈ తోటల్లో వేసే పసుపుకి రసాయనిక ఎరువుల కన్నా సేంద్రియ ఎరువులను ఎక్కువ వినియోగిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
 
 
 

మరిన్ని వార్తలు