అమ్మ భాషకు ఊపిరిపోద్దాం

21 Feb, 2017 22:59 IST|Sakshi
అమ్మ భాషకు ఊపిరిపోద్దాం
నన్నయలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
రాజ రాజనరేంద్రనగర్‌ (రాజానగరం) : జన్మనిచ్చిన తల్లిని, మాటలు నేర్పిన మాతృ భాషను ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తుంచుకోవాలని, అవే మన మనుగడకు మార్గాలవుతాయని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉభయ గోదావరి జిల్లాల కవులు, రచయితల సాహిత్య సమ్మేళనాన్ని మంగళవారం ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అమ్మ భాష గొప్పదనం, అమ్మ భాష కమ్మదనం తెలుగు భాషకు ఉందంటూ ఎందరో కవులు లిఖించిన వర్ణణలను ఉటంకిస్తూ ప్రపంచ భాషలో ఆ మాధుర్యం ఒక్క తెలుగులోనే దొరుకుతుందన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స’గా వర్ధిల్లిన మాతృభాష అంతరించిపోతున్న భాషల్లో చేరడం నిజంగా దురదృష్టకరమన్నారు. మాతృభాష పరిరక్షణకు కవులు, రచయితలు తమ కలాలను, గళాలను విప్పాల్సి ఉందని విశిష్ట అతిథి స్పెయిన్‌ రచయిత, ప్రీలాన్స్‌ జర్నలిస్టు ఫోటోగ్రాఫర్‌ అశోక్‌ బీర అన్నారు. పాశ్చాత్య దేశాలలో మాతృభాషలకు అధిక ప్రాధాన్యం ఇస్తారని, వారి విద్యా బోధన ఆయా భాషల్లోనే జరుగుతుందన్నారు. మరో విశిష్ట అతిథి, సీనియర్‌ జర్నలిస్టు యడవల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ పత్రికలు కూడా ఆంగ్ల పదాలకు తగ్గించి, తెలుగు పదాల వాడకం పెంచాలన్నారు. పాలన, బోధన, జనజీవన రంగాలలో తెలుగు భాషను కచ్చితంగా అమలు చేయాలని తెలుగు భాష రక్షణ వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ అన్నారు. తెలుగు భాషకు సీపీ బ్రౌన్‌ చేసిన కృషిని నన్నయ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎ.నరసింహరావు గుర్తు›చేశారు. అమ్మ, అమ్మ భాషను మరిచిపోతే సమాజం మనుగడను కూడా కోల్పోతుందని సదస్సు సంచాలకులు డాక్టర్‌ తరపట్ల సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం, కాకినాడ, రాజోలు, రామచంద్రాపురం, పాలకొల్లు, భీమవరంలలో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. 
తీర్మానాలు..
ప్రాథమిక స్థాయి నుంచి తెలుగులో విద్యా బోధన జరగాలని, పాఠశాల నుంచి కళాశాల వరకు విధిగా తెలుగు భాషను అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో సదస్సు కోకన్వీనర్‌ డాక్టర్‌ ఆర్‌. జానకీరావు, కోఆర్డినేటర్స్‌ డాక్టర్‌ నిట్టల కిరణ్‌చంద్ర, డాక్టర్‌ పి.లక్ష్మీనారాయణ, డాక్టర్‌ డి.లక్ష్మీనరసమ్మ, డాక్టర్‌ జి.ఎలీషాబాబు, విద్యార్థులతోపాటు కళాసాహితీ, రమ్య సాహితీ, నన్నయ వాజ్మయపీఠం, స్ఫూర్తి, కళాస్రవంతి, సీపీ బ్రౌన్‌ సేవాసమితి, సహృదయ సాహితీ, దళిత చైతన్య వేదిక, వంటి 16 సాహితీ సంస్థలు పాల్గొన్నాయి. ఆయా రంగాలలో పేరుగడించిన స్పెయిన్‌ రచయిత, ప్రీలాన్స్‌ జర్నలిస్టు ఫొటోగ్రాఫర్‌ అశోక్‌ బీర, సీనియర్‌ జర్నలిస్టు యడవల్లి శ్రీనివాస్, తెలుగు భాష రక్షణ వేధిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌లను సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
రసరమ్యంగా సాగిన కవి సమ్మేళనం
అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో డాక్టర్‌ కడిమళ్ల శతావధాని, గిడ్డి సుబ్బారావు, జోరశర్మ, దడ్డ దైవెజ, వీడుల శిరీష, డాక్టర్‌ గిరినాయుడు, గడల, డాక్టర్‌ రెంటాల, ఎంఆర్‌వి సత్యనారాయణమూర్తి, గనార, గరికిపాటి మాస్టారు, మద్దల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణపై జరుగుతున్న సదస్సులు, పర్యావరణం, నగదు రహిత లావాదేవీలు, ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలు తదితర అంశాలపై విమర్శలు, ఎత్తిపొడుపులు, పొగడ్తలు ఇలా తమదైన శైలిలో కవులు వ్యంగ, హాస్య, చమత్కార భాణాలను వదులుతూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. 
>
మరిన్ని వార్తలు