రవాణాశాఖలో ఆన్‌లైన్‌ సేవలకి అవాంతరాలు

2 Aug, 2016 23:47 IST|Sakshi
రవాణాశాఖలో ఆన్‌లైన్‌ సేవలకి అవాంతరాలు

సాక్షి, సిటీబ్యూరో: రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆటోమేటెడ్‌ ఆన్‌లైన్‌ పౌరసదుపాయాలు తొలిరోజే వాహన దారులకు చుక్కలు చూపించాయి.  మంగళవారం స్లాట్‌ నమోదు చేసుకొన్న వారంతా ఫీజు చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్‌ బుకింగ్‌ విధానంపై అవగాహన లేక చాలామంది నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి ఉసూరుమంటూ వెనుదిరిగారు. హైదరాబాద్, రంగారెడ్డి  జిల్లాల్లోని 10 ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో అన్ని రకాల రవాణా కార్యకలాపాలకు (ట్రాన్సాక్షన్స్‌) కలిపి ప్రతి రోజు సుమారు 10 వేల దరఖాస్తులు వస్తుంటాయి.

కొత్తగా ప్రవేశపెట్టిన స్లాట్‌ పద్ధతి వల్ల కేవలం 4 వేల దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా అందాయి. చాలామంది ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చి వెనుదిరిగారు. ప్రతి రోజు 150 కొత్త వాహనాలు నమోదయ్యే ఖైరతాబాద్‌ సెంట్రల్‌ కార్యాలయంలో కేవలం  20 వాహనాలే  నమోదయ్యాయి. ఒక్క లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులు (ఈ రెండింటికి చాలా కాలంగా స్లాట్‌ బుకింగ్‌ ఉంది.) మినహా మిగతా 56 రకాల పౌరసదుపాయాలపై ఆన్‌లైన్‌ దరఖాస్తులు సగానికి పైగా పడిపోయాయి. నగరంలోని  సికింద్రాబాద్, ఉప్పల్, మెహదీపట్నం, మలక్‌పేట్, అత్తాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి, చాంద్రాయణగుట్ట, కొండాపూర్‌ తదితర అన్నిచోట్ల వాహన వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు.

ఈ సేవా కేంద్రాల్లో ఇక్కట్లు...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1400 ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్‌ సేవల కోసం స్లాట్‌ బుకింగ్, ఫీజు చెల్లింపు సదుపాయం ఉన్నట్లు రవాణా అధికారులు  స్పష్టం చేశారు. కానీ చాలా చోట్ల స్లాట్‌ బుకింగ్‌కు మాత్రమే అవకాశం లభించింది. ఫీజు చెల్లింపునకు ఆప్షన్‌ లేకపోవడంతో స్లాట్‌ న మోదు చేసుకున్నప్పటికీ ఫీజు చెల్లించలేక ఆర్టీఏ సేవలను పొందలేకపోయారు. దీంతో ఒకటికి రెండు సార్లు  ఇటు ఈ సేవా కేంద్రాలకు, అటు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసి వచ్చింది. ఈ సేవ కేంద్రాలకు ఆర్టీఏకు మధ్య సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

లింకు ఏర్పాటు కాకపోవడం వల్లనే ఫీజు చెల్లింపునకు ఆప్షన్‌ లేకుండా పోయిందని ఈ సేవా నిర్వాహకులు తెలిపారు. గ్రేటర్‌ పరిధిలోని  కేవలం 50 ఈ సేవా కేంద్రాల్లో  మాత్రమే  ఫీజు చెల్లింపునకు అవకాశం లభించింది. ఇప్పటి వరకు కేవలం లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులకు మాత్రం స్లాట్‌లు నమోదయ్యే ఈ సేవా కేంద్రాల్లో ఒక్కసారిగా 58 రకాల సేవలకు సంబంధించి స్లాట్‌లు నమోదు చేయవలసి రావడంతో పనిభారం పెరిగి గందరగోళం నెలకొంది.  నిబంధనల ప్రకారం స్లాట్‌ నమోదు చేసుకొని, ఫీజు చెల్లించి వచ్చిన వాళ్లలో కొందరు ఆలస్యంగా వచ్చినట్లు భావించిన అధికారులు పలు చోట్ల రూ.25 చొప్పున ఆలస్యపు రుసుము వసూలు చేసినట్లు  వినియోగదారులు విస్మయం వ్యక్తం చేశారు.

గందరగోళం...
మరోవైపు ఆన్‌లైన్‌ సేవల అమలులో కొన్ని చోట్ల ఆర్టీఏ ఉద్యోగులకు సైతం సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఆర్టీఏ కౌంటర్‌లు ఖాళీగా కనిపించాయి. ఒకవైపు వినియోగదారులు లేకపోవడం వల్ల మరోవైపు సిబ్బంది గందరగోళం వల్ల కొంతసేపు స్తబ్ధత కనిపించింది. నగరంలోని ప్రధాన కార్యాలయాల్లో సాంకేతిక నిపుణులను ఏర్పాటు చేసినప్పటికీ సమస్యలు తొలగిపోలేదు. దీంతో ప్రాంతీయ రవాణా అధికారులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తొలిరోజు తలెత్తిన సాంకేతికపరమైన ఆటంకాల వల్ల వాహనాల యాజమాన్య బదిలీలు, డూప్లికేట్‌ ఆర్సీ, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్, వివిధ రకాల డాక్యుమెంట్‌ల రెన్యూవల్స్‌ వంటివన్నీ నిలిచిపోయాయి.
 

మరిన్ని వార్తలు