‘ఇంటి’గుట్టు రట్టు!

14 Feb, 2017 01:46 IST|Sakshi
‘ఇంటి’గుట్టు రట్టు!
తాడేపల్లిగూడెం రూరల్‌ : ఇళ్లు నిర్మించుకోవడానికి రుణాలు ఇప్పిస్తామంటూ పలువురు పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని శివాలయం వీధిలో నివాసముంటున్న పలువురు పేదలు ప్రభుత్వ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరికి ఇంటి స్థలం ఉంది. స్థానికంగా నివాసముంటున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ యడల సత్యనారాయణరాజుతో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ కంట్రీ ప్లానింగ్‌లో అవుట్‌ సోర్సింగ్‌పై పనిచేస్తున్న బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ వంగా సంజీవ వరప్రసాద్, ప్రైవేట్‌ సర్వేయర్‌ షేక్‌ రామ్‌కఫిర్‌ సాహెబ్, భరణికాపుల నాగరాజులు పేదల నుంచి రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పట్టణమంతా వ్యాపించి చివరకు దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు చెవిన పడటంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. మంత్రితో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ బాలాజీ, అసిస్టెంట్‌ కమిషనర్‌ బీహెచ్‌ సంగీతరావు, పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ మూర్తి తదితరులు ఆ ప్రాంతానికి చేరుకుని ఘరానా మోసగాళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారు, బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా ఎంత మంది మోసపోయారనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగవలసి ఉంది. కాగా, నిందితులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. 
 
కల్లబొల్లి మాటలు నమొ్మద్దు 
ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ చెప్పే కల్లబొల్లి మాటలను నమొ్మద్దని మున్సిపల్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ బాలాజీ సూచించారు. బాధితులు ఎంత మంది ఉన్నారనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. 
 
చీటింగ్‌ కేసు నమోదు 
పేదల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్న ఆర్‌ఎంపీ డాక్టర్‌ యడాల సత్యనారాయణరాజు, వంగా సంజీవ వరప్రసాద్, షేక్‌ రామ్‌ కఫీర్‌ సాహెబ్, భరణికాపుల నాగరాజులపై బాధితుడు పైడికొండల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. సీఐ మూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 
 
ఉసూరుమనిపించారు 
ఇంటి నిర్మాణానికి రుణం కోసం దరఖాస్తు చేశా. రుణం మంజూరైంది బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, స్థలం పట్టా, రూ.వెయ్యి తీసుకుని రమ్మన్నారు. తీరా అన్ని తీసుకుని వచ్చే సరికి ఇక్కడి పరిస్థితి మరోలా ఉంది. రుణం మంజూ రైందని ఎంతో సంతోషించా...అంతలోనే ఆనందం ఆవిరైపోయింది. 
– కొండే వెంకాయమ్మ 
 
>
మరిన్ని వార్తలు