అడుగడుగునా అడ్డంకులు

17 Jul, 2016 20:56 IST|Sakshi
అడుగడుగునా అడ్డంకులు
కర్నూలు(అగ్రికల్చర్‌):
సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఉద్దేశించిన సర్వేకే సమస్యలు మొదలయ్యాయి. సిగ్నల్‌ అందకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడంతో ప్రజాసాధికారిక సర్వే పరిస్థితి ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 10వతేదీన ప్రజాసాధికార సర్వే మొదలైంది. ప్రతి రోజూ ఒక్కో ఎన్యూమరేటర్‌ కనీసం 14 ఇళ్లు సర్వే పూర్తి చేయాలి. ఈ లెక్కన ఇప్పటి వరకు 1.50 లక్షల గహాలను కవర్‌ చేసి వివరాలు నమోదు చేయాల్సి ఉండగా ఆ సంఖ్య 2098కి కూడా దాటలేదని సమాచారం. ఈ పరిస్థితికి సాంకేతిక సమస్యలే కారణంగా తెలుస్తోంది. జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 2380 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఎన్యూమరేటర్లు, వారి సహాయకులు, సూపర్‌వైజర్లు దాదాపు సర్వేలో 4 వేల మంది భాగస్వాములవుతున్నారు. ఇందులో అన్ని శాఖల సిబ్బంది ఉండడం, వీరు పూర్తిగా సర్వేకే పరిమితం కావడంతో రోజువారీ కార్యాలయ పనులు నిలిచిపోయి జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అటు సర్వే సాగక, ఇటు ఆఫీసు కార్యకలాపాలు నడవక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. రోజుకో వర్షన్‌ మారుస్తుండడం, ఇంతవరకు ట్యాబ్‌ల్లో ఎన్యూమరేటర్లు వేలి ముద్ర వేసినా ఓపెన్‌ కాకపోవడం తదితర సమస్యల వల్ల సర్వే ఏ మాత్రం ముందుకు సాగడం లేదు. దీనికితోడు పల్లెల్లో నెటవర్క్, సర్వర్‌డౌన్‌ సమస్యలు సాధారణమైపోయాయి. 
వర్షన్‌ మార్చినా..
జిల్లా వ్యాప్తంగా 10 లక్షలకుపైగా కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంది. శుక్రవారం 2.4.1 కొత్త వర్షన్‌ ఇచ్చారు. దీంతో సాంకేతిక సమస్యలు ఉండవని, సర్వే సాఫీగా సాగుతుందని ఉన్నతాధికారులు చెప్పారు. కానీ కొత్త వర్షన్‌తో కూడా అదే పరిస్థితి. తాజాగా శనివారం ఇచ్చిన 2.4.2 వర్షన్‌ కూడా సర్వేకు ఉపకరించలేదు. 
అసలు  సమస్య ఇది.. 
సర్వేకు సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి వేలి ముద్ర అథెంటికేషన్‌ దగ్గరకు వచ్చేసరికి ఎర్రర్‌ అంటూ సర్వర్‌ డౌన్‌ అవుతోంది. రోజుకో వర్షన్‌ ఇస్తున్నా సాంకేతిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. వేలిముద్రకు ఎరెక్షన్‌ కంపెనీ బయోమొట్రిక్‌లు ఇచ్చారు. వీటిని జిల్లా స్థాయిలో కొన్నారు. ఇవి పనిచేయకపోవడంతో మంత్ర బయోమొట్రిక్‌లు వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికితోడు నెట్‌వర్క్‌ సమస్యలు కూడా వేధిస్తున్నాయి.  సర్వే మొదలై ఆరు రోజులు పూర్తయినా నాలుగు వేల మంది నిమగ్నమైనా పెద్దగా పురోగతి లేకపోవడం గమనార్హం. అ«ధికార వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,792 ఇళ్లలో 4,868 మంది, అర్బన్‌ ప్రాంతాల్లో 306 గహాలను సర్వే చేయగలిగారు. 
 ఆఫ్‌లైన్‌ టు ఆన్‌లైనే పరిష్కారం: మౌలాబాషా, వీఆర్‌ఓ, బ్రాహ్మణకొట్కూరు
 రెవెన్యూలో ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉన్నా పక్కనపెట్టి ప్రజాసాధికార సర్వేకు వెళ్తుతున్నాం. ఇంటి లొకేషన్‌ వివరాల నమోదులో ఇబ్బందులు లేవు కానీ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి అథెంటికేషన్‌ తీసుకోవడం దగ్గర సర్వర్‌ డౌన్‌ అవుతోంది. ఇప్పటి వరకు నందికొట్కూరు మండలంలో ఒక్క ఇల్లు కూడా సర్వే పూర్తి కాలేదు. ఆఫ్‌లైన్‌లో సర్వే చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే సమస్యకు పరిష్కారం. శుక్రవారం 2–4.2 వర్షన్‌ ఇచ్చినా ఉపయోగం లేదు. 3జీ,4జి సిమ్‌లు ఇచ్చినా నెట్‌వర్క్‌ సమస్యలు పరిష్కారం కావడం లేదు.
 
మరిన్ని వార్తలు