20రోజులుగా ఖాళీ

25 Feb, 2017 23:15 IST|Sakshi
20రోజులుగా ఖాళీ
  • ఖజానా ఖాళీతో చెల్లని చెక్కులు  
  • పనులు చేయలేమంటున్న కాంట్రాక్టర్లు
  • మట్టి ఖర్చుల పద్దులు ఫ్రీజింగ్‌
  • పెళ్లిళ్ల సీజన్‌తో అల్లాడుతున్న ఉద్యోగులు,   పెన్షనర్లు
  • ఎప్పటికి విడుదల చేస్తారో తెలియదంటున్న అధికారులు
  • గుడివాడ: ప్రభుత్వ ఖాతాల కార్యాకలాపాలు నిలుపుదల చేసి సోమవారం నాటికి 20 రోజులు పూర్తి అవుతుంది. నాటి నుంచి ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి. కోటాను కోట్లు ఖర్చుతో మహిళా సాధికారిత సదస్సులు పెట్టి మా కడుపులు మాడుస్తున్నారని ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఆవేదనతో రగిలి పోతునారు. ట్రెజరీ చెక్కులు తీసుకున్న వారు బ్యాంకుల వద్దకు వెళ్లి బిక్కముఖంతో వెనుతిరుగుతున్నారు.

    మూడు పద్దులు మాత్రమే వదిలారు...
    ఈనెల 8న ప్రభుత్వ అకౌంట్లు ప్రీజింగ్‌ చేసిన నాటినుంచి మూడు రోజుల కిందట కోర్టు చెక్కుల చెల్లింపుకు 2014 పద్దును మాత్రమే వదిలారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వీఆర్‌ఏల జీతాలకు సంబంధించిన పద్దుల బిల్లులు చెల్లింపులకు అవకాశం కల్పిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాలు, జీపిఎఫ్‌ ఖాతాల్లో రుణాల విషయంలో ఇంతవరకు వదలలేదు. దీనికి తోడు మున్సిపాల్టీలకు సంబంధించిన సొంత ఖాతాల్లో కూడా ఫ్రీజింగ్‌ పెట్టారు. ఫలితంగా పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపులు లేక నానా తంటాలు పడుతున్నారు.  శుభకార్యాలు చేసుకుందామని జీపీఎఫ్‌ రుణాలు కోసం దరఖాస్తుచేసినా ఫలితం లేకుండా పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు  ఉన్నారు. ఒక్క గుడివాడ సబ్‌ ట్రెజరీ కార్యాలయంలోనే దాదాపుగా 500కు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.

    నిలిచిపోయిన అభివృద్ది పనులు..
    మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. పాత పనుల బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో కరెంటు బిల్లులు, రోజువారీ ఖర్చులకు చెల్లింపులు చేయలేక సర్పంచ్‌లు తంటాలు పడుతున్నారు. మార్చినెల ముగింపు నేపథ్యంలో కొన్ని పనులు పూర్తి చేయకపోతే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది.

     పంచాయతీ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదు...
    ట్రెజరీలో ఒక్క బిల్లు కూడా మారటం లేదు. పంచాయతీ పాలన కుంటుపడింది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. జీతాల కోసం సొంత డబ్బులు ఇస్తున్నాం. వీధిలైట్లు, బ్లీచింగ్, వర్కర్స్‌ జీతాలు ప్రభుత్వం ఇస్తే కొంత వరకు ఇబ్బందులు తొలుగుతాయి. బిల్లులు నిలుపుదల చేస్తే పంచాయతీ పాలన ఎలా చేయాలి.   
    –సదుర్తిసాయిబాబు –దండిగానపూడి, సర్పంచ్‌

    ఒక్క బిల్లు రాలేదు..
    ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన జన్మభూమి–మాఊరు గ్రామసభలకు సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. ఇంత వరకూ బిల్లు మంజూరు చేయలే దు.  అత్యవసర బిల్లులు సైతం నిలుపుదలచేశారు. రోజు ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. బిల్లులు మాత్రం పాస్‌ కావటం లేదు. అడిగితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. చంద్రబాబు ఏ ఖర్చు మానేస్తున్నారు .  
    –నీలం ఉదయ్‌కుమార్, సర్పంచ్, వెన్ననపూడి

    నిలిచిన ఉపాధి పనులు...
    జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న రోడ్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రెజరీల్లో ఫ్రీజింగ్‌ కారణంగా సిమెంట్‌కు రాసిచ్చినా నిధులు విడుదల కావడం లేదు. ఈ విధానం మార్చి నెల వరకు కనబడుతుంది. కాని జిల్లా కలెక్టరు మాత్రం మార్చిలోగా పనుల్ని పూర్తి చేయాలని అంటున్నారు. ఎలా సాధ్యం.  
    – పి. బాలయ్య,వడ్లమన్నాడు సర్పంచ్‌

మరిన్ని వార్తలు