విచారణ పక్కా.. తేలాలి లెక్క

28 Aug, 2016 18:39 IST|Sakshi
విచారణ పక్కా.. తేలాలి లెక్క

‘బోగస్‌’ టీచర్లపై మరోమారు విచారణ
విచారణాధికారిగా పశుసంవర్ధకశాఖ జేడీ
రెండ్రోజుల పాటు కొనసాగిన వాదనలు
త్వరలో క్షేత్రస్థాయిలో ధ్రువపత్రాల పరిశీలన
పక్షం రోజుల్లో తేలనున్న నకిలీల బాగోతం

తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన అంశం కొత్త మలుపు తిరిగింది. వక్రమార్గంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కించుకున్న వారిపై రాష్ట్ర విద్యాశాఖ చర్యలకు ఆదేశించగా... జిల్లా విద్యాశాఖ మరోమారు నిశిత పరిశీలన చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో వాస్తవాలను పరిశీలించి, బోగస్‌ టీచర్లను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని కలెక్టర్‌ నిర్ణయించారు. దీంతో మరోవిడత విచారణకు ఆయన ఆదేశిస్తూ విచారణ అధికారిగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వరప్రసాద్‌రెడ్డిని నియమించారు. దీంతో ఆయన విచారణ ప్రక్రియను ప్రారంభించారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా

జిల్లాలో 17మంది నకిలీ టీచర్లు ఉన్నట్టు విద్యాశాఖ తేల్చింది. దీంతో వారినిమాత్రమే విచారించాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో విచారణాధికారి వరప్రసాద్‌రెడ్డి శుక్ర, శనివారాల్లో ఆయా టీచర్లను ప్రత్యేకంగా విచారించారు. నకిలీ సర్టిఫికెట్లకు సంబంధించి వారిని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో కొందరు తప్పుడు కుల ధ్రువపత్రాలు, వికలత్వ సర్టిఫికెట్లు ఉన్నట్లు అభియోగాలుండడంతో అందుకు సంబంధించి ఆరా తీశారు. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా విద్యాశాఖ వద్ద ఉన్న వివరాలను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉండడంతో ఆ మేరకు రికార్డు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా సర్టిఫికెట్లు జారీ చేసిన సంస్థలనుంచి సైతం ఆయన వివరాలు తీసుకోనున్నారు.

పక్షం రోజుల్లోగా పూర్తి...
అభియోగాలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయలు నుంచి ప్రాథమిక వివరాలను సేకరించిన విచారణాధికారి... ధ్రువపత్రాలకు సంబంధించి వివరాలు సమర్పించాలని విద్యాశాఖను ఆదేశించారు. ఆ వివరాల ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్టిఫికెట్లు జారీచేసిన సంస్థల్లో పరిశీలన చేయనున్నారు. ఈ ప్రక్రియ దాదాపు పక్షం రోజుల్లో పూర్తవుతుందని, ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం పూర్తిస్థాయి నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తానని విచారణాధికారి వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

మరికొందరిపై ఫిర్యాదులు..
నకిలీ టీచర్ల అంశంపై మరికొన్ని ఫిర్యాదులు విద్యాశాఖకు వచ్చాయి. అందుకు సంబంధించిన ఆధారాలు సైతం ఫిర్యాదుదారులు సమర్పించడంతో వాటిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఆయా టీచర్లకు ముందుగా షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నారు. అలా వారిచ్చే వివరణలతో తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
 

మరిన్ని వార్తలు