బంతి బంతికీ బెట్టింగ్‌ !

11 Apr, 2017 09:23 IST|Sakshi
బంతి బంతికీ బెట్టింగ్‌ !

= ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లకు జోరుగా పందేలు
= జిల్లాలో రోజుకు రూ.10కోట్లకు పైగా లావాదేవీలు
= బెట్టింగ్‌ రాకెట్‌కు కేంద్రంగా విజయవాడ బావాజీపేట
= టీడీపీ ప్రజాప్రతినిధి సన్నిహితులే సూత్రధారులు
= రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌ రాకెట్‌కు ఇదే కేంద్ర స్థానం


ఓకే... డన్‌... బస్‌... ఈటింగ్‌... టీజింగ్‌... ఫైనల్‌... ఇవీ కొన్ని రోజులుగా విజయవాడ బావాజీపేటలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం వద్ద సెల్‌ఫోన్లలో మార్మోగుతున్న పదాలు. ఈ కోడ్‌ భాష వెనుక  కోట్ల రూపాయల క్రికెట్‌ బెట్టింగ్‌ దందా దాగి ఉంది. మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లుగా నోట్ల వర్షం కురిసే కిటుకు ఉంది. ఆన్‌లైన్‌లోనే కోట్ల రూపాయలు అకౌంట్లు మారే గమ్మత్తు ఆట ఉంది. బహిరంగ రహస్యంగా మారిన ఈ బెట్టింగ్‌ రాకెట్‌ వైపు పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. నగరంలో వివాదాస్పదుడిగా పేరున్న టీడీపీ ప్రజాప్రతినిధి సన్నిహితులు ఈ బెట్టింగ్‌ దందాకు సూత్రధారులు కావడమే ఇందుకు కారణం. మరోవైపు జిల్లా అంతటా బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది.

సాక్షి, అమరావతిబ్యూరో : బెట్టింగ్‌ రాయుళ్లు ‘ఐపీఎల్‌ పండుగ’ చేసుకుంటున్నారు. మ్యాచ్‌ల కోసం క్రికెట్‌ అభిమానుల కన్నా వారే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ వన్డే, టీ–20 టోర్నమెంట్లు మొదలైతే చాలు... బావాజీపేట ప్రధాన కూడలిలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయం వద్ద సందడి నెలకొంటుంది. ప్రస్తుత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌లో ఇక్కడ కోలాహలంగా మారింది. నగరంలో వివాదాస్పదుడైన టీడీపీ ప్రజాప్రతినిధి, ఆయన కుమారుల సన్నిహితులు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పేరుకు రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయమని బోర్డు పెట్టినప్పటికీ ఆ ప్రజాప్రతినిధి దందాలకు ఇదే కేంద్ర స్థానం. ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. ముంబయి, ఢిల్లీలోని క్రికెట్‌ బెట్టింగ్‌ ప్రధాన బుకీలకు సదరు ప్రజాప్రతినిధి వర్గీయులు రాష్ట్రంలో ఫ్రాంచైజీగా వ్యవహరిస్తున్నారు. బెట్టింగ్‌ నిర్వహణకు అవసరమైన మల్టీకాల్‌ లైన్‌ సూట్‌కేస్, ఎక్కువ సంఖ్యలో సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలను కూడా ఏర్పాటు చేశారు.

రోజుకు రూ.10కోట్లకు పైగా బెట్టింగ్‌: ఐపీఎల్‌ సీజన్‌లో బెట్టింగ్‌ వ్యామోహం వెర్రితలలు వేయడం ఈ రాకెట్‌కు కలసి వస్తోంది. అధికారుల నుంచి చిల్లరవర్తకుల వరకూ క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యసనం బారిన పడటం గమనార్హం. బావాజీపేట కేంద్రం నుంచి వివిధ జిల్లాల్లోని బెట్టింగ్‌రాయుళ్లతో  ఫోన్లలోనే మాట్లాడుతూ పందేలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా కోడ్‌ భాషలోనే సాగుతుంది. ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న తమ ఏజెట్లను పెద్ద మొత్తంలో డిపాజిట్‌ తీసుకోవడం, ఇతరత్రా విధానాలు అనుసరిస్తున్నారు. ఒక ఓవర్‌కు సంబంధించి కనీస పందెం రూ.2వేల నుంచి మ్యాచ్‌ విజేత ఎవరనే దానిపై రూ.50 వేల వరకూ పందేలు కాస్తున్నారు. ఒక మ్యాచ్‌కు సంబంధించి బావాజీపేట కేంద్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.10కోట్ల వరకు బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారని అంచనా. మరోవైపు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరుగుతోంది.

మరిన్ని వార్తలు