ప్రజాపంపిణీలో అక్రమాలు

28 Jan, 2017 21:39 IST|Sakshi
ప్రజాపంపిణీలో అక్రమాలు
- డోన్‌లో ముధుసూదన్‌ గుప్త బినామీలే డీలర్లు
-2వేల రేషన్‌ కార్డులు వస్తే కొందరికే ఇచ్చారు
- ఆహార సలహా సంఘం సమావేశంలో
  పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రజా పంపిణీలో అక్రమాలు పెరిగిపోయని, నిజాయితీగా వ్యవహరించే డీలర్లపై వేధింపులు అధికమమ్యాయని ఏపీసీ చైర్మన్‌, డోన్‌ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా ఆహార సలహా సంఘం సమావేశం జేసీ హరికిరణ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గంలో మూడేళ్లుగా ఏ మండలంలోనూ ఆహార సలహా సంఘం సమావేశాలు జరిగిన దాఖలాలు లేవన్నారు.
 
డోన్‌ పట్టణంలో 4, 7, 10, 17, 68 చౌకదుకాణాలకు మధుసూదన్‌ గుప్త అనే వ్యక్తి డీలరుగా ఉన్నారని, ఈయన పేరుతో బినామీలు డీలర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి నెలా ఒకరు సరుకులు పంపిణీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలో 27 మంది డీలర్లు ఉండగా సగం మందిని వేధిస్తున్నారని, గ్యాస్‌ కనెక‌్షన్‌ ఉన్నా లేనట్లుగా చూపి కిరోసిన్‌ వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డోన్‌ మున్సిపాలిటీకి కొత్తగా 2000 రేషన్‌ కార్డులు వస్తే  కొందరికి మాత్రమే ఇచ్చారన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ..ఒకే వ్యక్తి ఆరు షాపులను నిర్వహించడంపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ప్రతి రెండు నెలలకోసారి విధిగా ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహిస్తామన్నారు. 
 
నిందితులను కఠినంగా శిక్షించండి
  •  ఈ–పాస్‌ కుంభకోణాన్ని బయటపెట్టిన కారణంగానే డీలర్‌ వెంకటేష్‌గౌడును హత్య చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని కమిటీ సభ్యుడు, వైఎస్‌ఆర్‌సీపీ నేత తోట వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి ఎస్పీకి పంపుదామని జేసీ తెలిపారు.  
  • కోడుమూరులో డీలర్ల దగ్గర బోగస్‌ కార్డులు ఉన్నాయని, ధనవంతులకు రేషన్‌ కార్డులు ఇచ్చారని కోడుమూరుకు చెందిన కమిటీ సభ్యుడు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.  
  •  ఉల్లిని నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించాలని జెడ్పీ మాజీ చైర్మన్‌ ఆకేపోగు వెంకటస్వామి కోరారు. 
  •  కర్నూలు కొత్త బస్టాండులో అన్ని వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారని జిల్లా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ విజయకుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. 
  • కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేటు, కొత్త బస్టాండు ప్రాంతాల్లోని రైస్‌ మిల్లులు, కారం, పసుపు, దాల్‌ మిల్లుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, కల్తీలకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత నరసింహులు యాదవ్‌ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.  తెలుపగా జేసీ స్పందిస్తూ విచారణ జరిపిస్తామని తెలిపారు. సమావేశంలో డీఓస్‌ఓ శశీదేవి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ ఏడీ రఘునాథరెడ్డి, కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్‌డీఓలు సత్యనారాయణ, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు