మూల్యాంకనంలో అక్రమాలకు చెక్‌

2 Jan, 2017 22:43 IST|Sakshi
మూల్యాంకనంలో అక్రమాలకు చెక్‌

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో మార్కుల కేటాయింపుపై నిఘా
అంతర్గతంగా తప్పులు తేలితే చర్యలు
జనవరిలో నోడల్‌ బృందాలతో తనిఖీలు


ఆసిఫాబాద్‌ రూరల్‌ : పదో తరగతి అంతర్గత మూల్యాంకనంలో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సమాయత్తమవుతోంది. ప్రధానంగా ప్రైవేటు పాఠశాల అక్రమాలకు ముక్కుతాడు వేసేందుకు తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పాఠశాల విద్య సంచాలకులు     తాజాగా ఆర్‌సీ సంఖ్య 92/డీఎస్‌ఈ /అకాడమిక్‌ /2016, తేదీ 23–12–2016 ఉత్తర్వులు విడుదల చేశారు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో మార్కుల అవార్డులను తనిఖీలు చేసేందుకు ప్రత్యేక మానిటరింగ్‌ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహంచాలని డీఈవోలను ఆదేశిస్తూ మార్గదర్శకాలను జారీ చేశారు. 2014–15 నుంచి నిరంతర మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్న విద్యాశాఖ పదో తరగతి విద్యార్థులకు విద్యాసంవత్సరంలో పాఠశాల స్థాయిలో నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక సంగ్రహణాత్మక మూల్యాంకనాన్ని నిర్వహిస్తోంది. ఇందులో నిర్మాణాత్మక మూల్యాంకనలో మార్కులు అవార్డు చేయడం పూర్తిగా ఉపాధ్యాయులు చేతుల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల సంగతెలా ఉన్నా..ప్రైవేటు పాఠశాలల వారు ర్యాంకులకు కక్కుర్తి పడి తమ విద్యార్థులకు అధిక మార్కులు వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ముందు ఇలాంటి అక్రమాలకు తావులేకుండా రెండు దఫాలుగా నోడల్‌ బృందాలు తనిఖీలు నిర్వహించేందుకు 2017 జనవరి రెండో వారంలో పాఠశాలలను సందర్శించనున్నాయి.

నైపుణ్య బృందాలు ఏం చేస్తాయంటే..
రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జిల్లా విద్యాశాఖాధికారి ఆ జిల్లాలోని అనుభవజ్ఞులైన ఓ ప్రధానోపాధ్యాయుడు, విషయ నిపుణులైన ఆరుగురు ఉపాధ్యాయులతో కూడిన నైపుణ్య బృందాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ బృందంలో జిల్లాలోని 20 పాఠశాలలను సందర్శించి పదో తరగతికి ఇప్పటి వరకు జరిగిన మూడు (ఎఫ్‌ఏ3 వరకు)నిర్మాణాత్మక మూల్యాంకన రికార్డులను పరిశీలిస్తుంది. మార్కులు సక్రమంగా వేశారా లేదా అనేది ప్రత్యేకంగా చూస్తుంది. పొరపాట్లను సరిచేస్తుంది కమ్యూలేటివ్‌ రికార్డుల్లో నమోదును పరిశీలించి ధృవీకరిస్తుంది. ఎస్‌ఏ1 మూల్యాంకన జవాబు పత్రాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పరిశీలన అంశాలను ఫొటోలు తీసి పరీక్షల సంచాలకులకు పంపిస్తారు.

నైపుణ్య బృందాలతోపాటు డీఈవో జిల్లాలో అందుబాటులో ఉన్న నిపుణుడైన ఓ ప్రధానోపాధ్యాయుడిని మానిటరింగ్‌ నోడల్‌ అధికారిగా నియమిస్తారు. ఈ నోడల్‌ అధికారి విషయ నిపుణుల బృందాలకు పాఠశాలలను కేటాయించడం, ప్రణాళికలను సిద్ధం చేయడంలో డీఈవోకు సహాయకారిగా ఉంటారు.

నియమించిన జిల్లాలోని మానిటరింగ్‌ బృందాలకు, నోడల్‌ అధికారి డీఈవోలకు ఈ నెల 30న ఎస్‌సీఈ ఆర్‌టీ విషయ నిపుణులు, రాష్ట్ర రిసోర్సు బృందంతో దృశ్య శ్రవణ మాద్యమం ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ బృందాలు పాఠశాలల్లో పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించి తనిఖీలు చేయాల్సి అంశాలను వివరిస్తారు. సందేహాలు ఉంటే తీరుస్తారు.

శిక్షణ పొందిన బృందాలు 2017 జనవరి రెండో వారంలోపు పాఠశాలలను సందర్శించి తనిఖీలు నిర్వహిస్తారు. ఎంఈవో వీరి వెంట ఉంటారు.
∙ఈ బృందాలు ఫిబ్రవరిలో రెండోసారి పాఠశాలలను సందర్శించి 4వ నిర్మాణాత్మక మూల్యంకన (ఎఫ్‌ఏ4)మార్కులు /గ్రేడ్లు రికార్డులను పరిశీలిస్తుంది. తుది 20 మార్కుల నమోదును పరిశీలించి ధ్రువీకరిస్తుంది.
∙ఈ విషయంలో ఆర్‌జేడీలు ప్రతీ జిల్లాలో ఐదు పాఠశాలలను సందర్శించి మూల్యాంకన తనిఖీలు చేస్తారు.
∙రాష్ట్ర మానిటరింగ్‌ బృందాలు సైతం ఫిబ్రవరిలో తనిఖీలు చేసి రూడీ చేసుకుంటారు.     
 

మరిన్ని వార్తలు