నీటి పారుదల అధికారుల్లో చలనం

13 Aug, 2016 22:43 IST|Sakshi
నీటి పారుదల అధికారుల్లో చలనం
 పెనుగొండ : అన్నపూర్ణ లాంటి పశ్చిమ డెల్టా ఎడారిగా మారుతోన్న వైనంపై ‘చేలు తడారి. . డెల్టా ఎడారి’ శీర్షికతో ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనం అధికారుల్లో (సం)చలనం కలిగించింది. నీటి పారుపాదల అధికారులు నీటి సంఘాల అధ్యక్షులతో కలిసి ఉరుకులు, పరుగులు పెట్టారు. పెనుగొండ శివారు, కొఠాలపర్రు, తామరాడ ప్రాంతాల్లో పర్యటించారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ పొత్తూరి రామాంజనేయరాజు, మార్టేరు ఏరియా నీటి సంఘాల అధ్యక్షుడు గంధం వెంకట్రాజు, నీటి పారుదల శాఖ ఈఈ జి.శ్రీనివాసరావు, డీఈ సీహెచ్‌ వెంకట నారాయణ వరిచేలను పరిశీలించారు.
ఈఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ డెల్టా కాలువలకు 7000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఎక్కడా లేదన్నారు. శివారు ప్రాంతాలకు నీరు చేరే విధంగా అధికారులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు. అయితే చానల్స్‌ మొగలో రైతులు అడ్డుకట్టలు వేసి తొలగించకపోవడం వల్ల శివారు ప్రాంతాలకు నీరు చేరడం కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. చానల్స్‌ మొదటి భాగంలో వరిచేలు మునిగిపోతున్నాయని చెప్పారు. వడలి చానల్‌–2, చెరుకువాడ చానల్‌లలో శివారు ప్రాంతాల్లో ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు. వాటిని పరిష్కరించి ప్రతి ఎకరానికి నీటిని అందిస్తామని చెప్పారు. పంట కాలువల్లో రైతులు చెత్త వేయకుండా నీటి ప్రవాహం ముందుకు సాగేందుకు తోడ్పాటునందించాలని కోరారు. 
 
 
మరిన్ని వార్తలు