డిపార్టుమెంటు సచ్చి పోయిందా!

14 Nov, 2016 23:24 IST|Sakshi
డిపార్టుమెంటు సచ్చి పోయిందా!
–రవాణ అధికారులపై కలెక్టర్‌ నిప్పులు
–నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌... చార్జి మెమోలు జారీ
–ఆటోలు ఓవర్‌లోడ్‌తో వెళితే ఎంవీఐలను సస్పెండ్‌ చేస్తా
కర్నూలు(అగ్రికల్చర్‌): డిపార్టుమెంటు ఉందా.. సచ్చి పోయిందా ... మీలో పవర్‌ లేదా? ఆటోలు ఓవర్‌లోడ్‌లో వెలుతుంటే మీకు కనబడదా? అంటూ రవాణ అధికారులపై జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారు. సోమవారం రవాణ అధికారులతో కొద్ది సేపు నిర్వహించిన సమావేశంలో వారిపై నిప్పులు చెరిగారు.  ఇదీ నేపథ్యం..ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కర్నూలులో పర్యటించారు. ముఖ్యమంత్రి పాల్గొనే డ్వాక్రా సదస్సుకు నగరం నుంచి వేలాది మందిని తరలించే విధంగా కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. మహిళలను తరలించేందుకు వీలుగా మెప్మాలో పనిచేసే ఒక్కో కమ్యూనిటీ ఆర్గనైజర్‌కు 50 వాహనాలు సమకూర్చాలని రవాణ శాఖ ఎంవీఐలకు ఆదేశాలు ఇచ్చారు.

అయితే, కొందరు ఎంవీఐలు తగినన్ని వాహనాలు సమకూర్చలేదు. దీంతో మహిళలను తరలించడంలో మెప్మా అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని మెప్మా అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ కాన్ఫరెన్స్ హాల్‌లో రవాణ అధికారులతో సమావేశం నిర్వహించి వాహనాలు సమకూర్చడంలో నిర్లక్ష్యంపై నిప్పులు చెరిగారు. ఏం తమాషగా ఉందా...నిద్ర పోతున్నారా వీఐపీల కార్యక్రమాలకే వాహనాలు పంపలేరా... వాహనాలు స్వాదీనం చేసుకునే పవర్‌ లేదా అంటూ మండిపడ్డారు.  సునీత, రఘునాథ్, శ్రీకాంత్, అతిగానా«థ్‌ అనే నలుగురు ఎంవీఐలకు రెండు ఇంక్రిమెంట్లను కట్‌ చేయడంతో పాటు చార్జి మెమోలు ఇచ్చారు. ఈ మేరకు ఫైల్‌ సర్క్యులేట్‌ చేయాలని డీటీసీని ఆదేశించారు. ఇక నుంచి ఆటోలు ఓవర్‌లోడ్‌తో వెళితే సంబంధిత ఎంవీఐలను సస్పెండ్‌ చేస్తానన్నారు. ఇందుకు  డీటీసీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికి మాట్లాడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ రామాంజనేయులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు