పాలా పాషాణమా?

12 Dec, 2016 14:33 IST|Sakshi
పాలా పాషాణమా?
- అంగన్‌వాడీలకు చెడిపోయిన పాలు సరఫరా
- దుర్వాసన వస్తుండడంతో దిబ్బల్లో పడేస్తున్న వైనం  
- 10 రోజులుగా సరఫరా కాని గుడ్లు, బియ్యం  
 
 
 
చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పేరుతో అందిస్తున్న సరుకుల విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు కనీస శ్రద్ధ కూడా పెట్టడం లేదు. ఈ నిర్లక్ష్యం కాస్త తలకెక్కడంతో చెడిపోయిన, మురిగి పోయిన వాటిని సరఫరా చేస్తూ చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. 90 రోజులపాటు నిల్వ ఉంటాయని మూడు రోజుల క్రితం సరఫఱా చేసిన పాలు దుర్వాసన వస్తూ తాగేందుకు వీలు కాకపోవడం ఇందుకు నిదర్శనం. 
 
ఆళ్లగడ్డ : 
ఆళ్లగడ్డ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లో 255 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 5,574 మంది గర్భిణీలు, బాలింతలు లబ్ధి పొందుతున్నారు.  వీరికి ప్రతి రోజు పాలు, గుడ్డుతో అన్నం ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ మెనూ క్షేత్ర స్థాయిలో ఏమాత్రం అమలు కావడంలేదన్న  ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్ముక్కై సరైన సమయంలో సరుకులు, పాలు, గుడ్లు సరఫరా చేయడంలేదు. ఇచ్చిన సరుకులు సైతం నాసీరకంగా ఉండి చిన్నారులు, గర్భిణీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 
 
90 రోజులు నిల్వ ఉంటాయంటే..
 గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలలకు గతంలో 200 గ్రా. పాలను దగ్గరలోని కేంద్రాలనుంచి ఏరోజుకారోజు సరఫరా చేసేవారు. అయినప్పటికీ కాస్త ఆలస్యమైతే విరిగి పోయేవి. అలాంటిది లేటెస్టు టెక్నాలజీతో పాలను ప్రిజ్‌ లేకుండా 90 రోజులు నిల్వ చేసుకోవచ్చని ఈ నెల 2వ తేదీ ప్రాజెక్టు పరిధిలో 27618 లీటర్ల పాల పాకెట్లను సరఫరా చేశారు. ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.44. ఈ లెక్కన రూ.12.15 లక్షలు ఖర్చు చేశారు. అయితే 90 రోజులు నిల్వ ఉంటాయని చెప్పిన పాలు రెండు, మూడు రోజులకే దుర్వాసన రావడం గమనార్హం. ఇప్పటికే సరఫరా చేసిన వాటిలో సగం వరకుదిబ్బల్లో పడేశారు. విషయం బయటకు చెపితే లబ్ధిదారులు తిడతారని, అధికారులు చివాట్లు పెడతారనే భయంతో మిన్నుకుండిపోతున్నారు. 
నిలిచిన గుడ్ల సరఫరా 
 దాదాపు 10 రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్లు సక్రమంగా గుడ్లు సరఫరా చేయట్లేదు. అరకొరగా ఇస్తున్న గుడ్లు కూడా 15 నుంచి 30 గ్రాములలోపు మాత్రమే ఉన్నాయి. కొన్ని కేంద్రాల్లో మురిగిపోయిన గుడ్లు ఇస్తున్నారు. దీంతో పాలు విరిగి పోయనవి, గుడ్లు మురిగి పోయినవి కోట్లు ఖర్చు పెట్టి రోగాలు తెప్పించేందుకా అంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తు‍న్నారు. 
 
 చూస్తూ ఎలా తాగాలి : మీనష , ఆళ్లగడ్డ  
గ్లాసులో పోసుకుంటే కంపు కొడుతున్నాయి. వాసన వస్తున్నాయని కొన్ని పాకెట్లు మురుగు కాల్వల్లో పడేస్తున్నారు. వీటిని చూస్తూ ఎలా తాగాలి. టీచర్లు చెప్పకుండా వీటిని పోస్తే, వాటిని తాగి చిన​ఉన్నారులు, గర్భిణీలు రోగాల బారిన పడితే ఎవరు జవాబుదారి. 
 
ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు..: పద్మావతి  : సీడీపీఓ 
పాలు చెడిపోతున్నాయన్న విషయం ఇంతవరకు నాదృష్టికి రాలేదు.  డిశంబర్‌ ఒకటవ తేదీ పాలపాకెట్లను అనంతపురం నుంచి సరఫరా చేశారు. ఇవి మూడు నెలలు (90 రోజులు) నిల్వ ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా చెడిపోని పాలు ఇక్కడే చెడిపోవడంఏంటీ.. అంతా కార్యకర్తల విడ్డూరం. విచారించి చర్యలు తీసుకుంటాం
 
మరిన్ని వార్తలు