ఎన్నిసార్లు చెబుతారు.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తా

15 Dec, 2016 23:34 IST|Sakshi
ఎన్నిసార్లు చెబుతారు.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తా
‘ముచ్చుమర్రి’ సైట్‌ మేనేజర్‌పై కలెక్టర్‌ ఆగ్రహం
పగిడ్యాల: ఎన్నిసార్లు చెబుతారు.. బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తానంటూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సైట్‌ మేనేజర్‌ రాముడుపై జిల్లా కలెక్టర్‌ విజయ్‌మోహన్‌ మండిపడ్డారు. గురువారం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నవంబర్‌ చివరికి ట్రయల్‌రన్‌ చేస్తామని చెప్పారు.. మోటార్లలో సాంకేతిలోపం తలెత్తిందని మరో మూడు రోజులు వ్యవధి తీసుకున్నారు.. చేతకాకపోతే చెప్పండి..ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిస్తాను’’ అంటూ హెచ్చరించారు. కరెంట్‌ సమస్య ఏమైనా ఉందా అని ప్రశ్నించడంతో అలాంటిది ఏమీలేదని ఎస్‌ఈ భార్గవరాముడు తెలిపారు. మోటార్‌లో తలెత్తిన సమస్యను సాయంత్రంలోగా గుర్తించాలని..ఈనెల 18న డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించాలని కలెక్టర్‌ ఆదేశించారు.  అనంతరం కేసీ కాలువ వద్ద ఏర్పాటు క్రాస్‌ రెగ్యూలేటర్‌ను పరిశీలించారు. కర్నూలుకు నీరు తీసుకెళ్లడానికి వీలుగా రెండు రోజులు రెగ్యూలేటర్లు బంద్‌ చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ నూతన కార్యాలయాలకు కనెక‌్షన్లు ఇచ్చి మీటర్లు అమర్చినప్పటికీ విద్యుత్‌ బిల్లులు రావడం లేదని అధికారులు.. కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కనెక‌్షన్‌ కట్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జలవనురుల శాఖ ఎస్‌ఈ నారాయణస్వామి, ఈఈ రెడ్డిశేఖర్, డీఈలు బాలాజీ, ఆదిశేషారెడ్డి, ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ భార్గవరాముడు, డీఈ ప్రభాకర్, తహసీల్దార్‌ కుమారస్వామి, ఎంపీడీవో విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు