ప్రభుత్వ కార్యక్రమమా...పార్టీ కరపత్రమా?

17 Dec, 2016 21:46 IST|Sakshi
ప్రభుత్వ కార్యక్రమమా...పార్టీ కరపత్రమా?
* దుర్గి మిర్చి యార్డు ఆహ్వాన పత్రికకు పార్టీ రంగు
* ప్రొటోకాల్‌నూ పక్కన పెట్టిన టీడీపీ నాయకులు
* వెల్లువెత్తుతున్న విమర్శలు
 
మాచర్ల : ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కడం, ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ రంగు పులమడం లాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారపార్టీ నాయకుల చర్యలతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.  ప్రభుత్వ సంస్థ అయిన మాచర్ల మార్కెట్‌ యార్డు ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన దుర్గి మినీ మిర్చియార్డు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి   వ్యవసాయ మార్కెట్‌ కమిటీ, మాచర్ల పేరుతో కరపత్రాలను ప్రచురించి ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు.  వీటిని తమ పార్టీ రంగు అయిన పసుపు రంగులో ముద్రించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి పి. పుల్లారావు ఫొటోలను పెట్టి, 22వ తేదీ గురువారం మధ్యాహ్నం 2గంటలకు జరిగే భూమిపూజకు హాజరు కావాలని యార్డు చైర్మన్‌ మల్లికార్జున రావు పేరుతో కరపత్రాలు ప్రచురించారు. ఈ కరపత్రంలో ఎక్కడా కూడా  స్థానిక ఎమ్మెల్యే పేరును ప్రస్తావించలేదు. గతంలో వేసిన శిలాఫలకంలో కూడా ఎమ్మెల్యే పేరుకు ప్రాధాన్యత ఇవ్వని విషయం తెలిసిందే.   యార్డు డబ్బులు ఖర్చు పెట్టి ప్రచురించిన కరపత్రాలకు పార్టీ రంగు పులమడం,  పార్టీ  కార్యక్రమంలాగా ప్రచారం నిర్వహించడంతో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి వసూలయ్యే పన్నుల ద్వారా ఆదాయం పొందే యార్డు అధికారులు సైతం అదేదో తెలుగుదేశం పార్టీ ఫండ్‌లాగా భావించి ప్రొటోకాల్‌ ఉల్లంఘించి కరపత్రాలు ప్రచురించడంపై   జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ప్రొటోకాల్‌ ఉల్లంఘన, ప్రభుత్వ నగదు దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరును వివిధ శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. 
మరిన్ని వార్తలు