స్వాహాకు మూల్యం !

20 Nov, 2016 03:55 IST|Sakshi
సాక్షి, నల్లగొండ:మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే పావలా వడ్డీని చౌటుప్పల్ మండలంలో స్వాహా చేసిన పది మంది ఐకేపీ ఉద్యోగులకు చార్జ్‌మెమోలు జారీ అయ్యాయి. పావలా వడ్డీ ‘స్వాహా’ శీర్షికన ఈ ఏడాది సెప్టెంబర్ 20న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందిం చారు. విచారణ జరిపి అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించుకున్న తర్వాత సదరు సిబ్బందికి తాఖీదులు ఇచ్చారు.  అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఈనెల 9న ఉత్తర్వులు జారీ చేశారు. ‘సాక్షి’ కథనంపై నెలన్నర రోజులుగా, జిల్లాలోని ఇతర మండలాలకు చెందిన ఐకేపీ ఆడిటర్లతో విచారణ చేయించారు. 
 
 వీరు చౌటుప్పల్ లోనిఐకేపీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించడంతో పాటు, గ్రామగ్రామాన తిరిగి, మహిళా సంఘాల సభ్యులను కలిసి విచారించారు. సంఘాల రికార్డులను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. వాటి ఆధారంగా చౌటుప్పల్ మండలంలో ఏపీఎంలుగా, సీసీలుగా పనిచేసిన 8మంది ఉద్యోగులతో పాటు, ఇద్దరు వీబీకేలకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య పేరిట చార్జ్‌మెమోలు జారీ చేశారు. ఇందులో వి.కృష్ణయ్య (ఏపీఎం,నార్కట్‌పల్లి), సుధారాణి (క్లస్టర్ ఏపీఎం, వలిగొండ), శ్రీనివాస్ (క్లస్టర్ ఏపీఎం, భువనగిరి), లక్ష్మీ (ఏపీఎం, మేళ్లచె ర్వు), వెంకటేశం (ఏపీఎం, చిట్యాల), నీరజ (ఏపీఎం,చౌటుప్పల్), కె.సత్తిరెడ్డి (ఆడిటర్, చౌటుప్పల్), కె.అలివేలు (సీసీ, చౌటుప్పల్)లు ఉన్నారు. 
 
 ఇంటెలిజెన్సు విచారణ
 ఈ అవినీతి వ్యవహారంపై ‘ సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఇంటెలిజెన్స్ ఎస్పీ స్పందించారు. పావలా వడ్డీ స్వాహాపై విచారణ జరిపించారు. దాదాపు రూ.39 లక్షలు పక్కదారి పట్టినట్టు ఇంటెలిజెన్సు విచారణలో తేలినట్టు విశ్వసనీయ సమాచారం. సంజాయిషీ తర్వాత, మరో వారం రోజుల్లో సస్పెన్షన్ల పర్వం మొదలుకానుందని తెలుస్తోంది. ఆరోపణలు వచ్చిన సిబ్బందిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపామని, ఈ మేరకు చార్జ్‌మెమోలు జారీ చేశామని డీఆర్‌డీఏ పీడీ  ఆర్.అంజయ్య ‘సాక్షి’కి తెలిపారు. 
 
 అసలేం జరిగిందంటే.... 
 చౌటుప్పల్ మండలంలోని మహిళా సంఘాలకు 2008కు ముందు మూడేళ్ల పావలా వడ్డీ రాలేదు. 2009లో ఒకేసారి రూ.84లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ కొద్ది రోజులకే 2009 ఏడాదికి సంబంధించిన పావలా వడ్డీ మంజూరైంది. ఈ సమయంలో అక్కడ పనిచేసిన ఏపీఎంలు, సీసీలు, కొందరు మహిళా సంఘాల లీడర్లతో కుమ్మక్కై, మొదట వచ్చిన రూ.84 లక్షల పావలా వడ్డీలో, సగానికి పైగా స్వాహా చేశారు. నిరక్షరాస్యులైన సంఘాల సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, వారి సంఘాల ఖాతాల్లో వేశారు.
 
   డబ్బులు పొరపాటున మీ ఖాతాలో పడ్డాయి, వేరే సంఘం వారివని చెప్పి, వారితో సంతకాలు చేయించుకుని, వారితోనే బ్యాంకు ఖాతాల నుంచి డ్రా చేయించి తీసుకున్నారు. ఇలా ఎవరికీ వారు స్వాహా పర్వానికి తెరలేపి సుమారు రూ.40 లక్షలను స్వాహా చేశారనేది విశ్వసనీయ సమాచారం. అయితే, బ్యాంకుల నుంచి వడ్డీని డ్రా చేసినట్టు రికార్డులు ఉన్నప్పటికీ, మహిళా సంఘాల రికార్డుల్లో ఎక్కడా రాయలేదు. యూసీలు లేవు. దీంతో సదరు ఉద్యోగులకు వారు పనిచేసిన కాలంలో, రికార్డులు లేని సొమ్ము గురించి సంజాయిషీ ఇవ్వాలని కోరారు.
 
మరిన్ని వార్తలు