మూసుకుపోయింది!

19 Jul, 2016 23:49 IST|Sakshi
నాగావళి నదిపై హౌరా–చెన్నై రైల్వేలైన్‌ బ్రిడ్జికి సమీపంలో ముఠా సాగించిన ఇసుక తవ్వకాల దృశ్యం
దూసి ఆర్‌ఎస్‌ ఇసుక అక్రమ ర్యాంపు మూసివేత
నది పక్కనే పొక్లయినర్లను దాసి పరారైన ముఠా
 వాటిని సీజ్‌ చేయకుండా తిరిగొచ్చిన అధికారులు
► పది రోజుల్లోనే రూ.56 లక్షలు దండుకున్న అక్రమార్కులు
► సీజ్‌ చేయకుంటే మళ్లీ ఇసుక తవ్వేందుకు అవకాశం
► పకడ్బందీ చర్యల్లేకుంటే పొంచివున్న పెను ప్రమాదం
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే నాగావళి నదిని ఇసుక తవ్వకాలతో తూట్లు పొడుస్తున్న మరో ముఠా తోక ముడిచింది! ఆమదాలవలస మండలం దూసిపేటలో పరిమితికి మించి పొక్లయినర్లతో నిబంధనలను విరుద్ధంగా రూ.15 కోట్లు విలువైన ఇసుకను దోపిడీ చేసిన ముఠా ఆగడాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇచ్చింది. దీంతో దూసిపేటలో ర్యాంపు నిలిచిపోయినా ఆ పక్కనే దూసి రైల్వేస్టేషన్‌ వద్ద మరో ర్యాంపును అక్రమంగా తెరిచింది మరో ముఠా. దీనిపై కూడా సాక్షి కథనం ఇచ్చింది.
 
ఈ ముఠా నిలువుదోపిడీపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైపవర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం సోమవారం జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనృసింహానికి ఫిర్యాదు చేయడంతో  అధికారులు స్పందించారు. మంగళవారం మధ్యాహ్నం ర్యాంపును పరిశీలించి.. అక్రమమని తేల్చారు. దీన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దూసి రైల్వే క్వార్టర్ల పక్కనుంచి ర్యాంపు వరకూ అక్రమంగా నిర్మించిన గ్రావెల్‌ రోడ్డు ప్రవేశమార్గాన్ని రైల్వే అధికారులు మూసివేశారు. అయితే ర్యాపు వద్దే గడ్డిలో ముఠా దాచేసిన రెండు భారీ పొక్లయినర్లను అధికారులు సీజ్‌ చేయకపోవడంపై దూసి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడగానే ముఠా మళ్లీ ఇసుక తవ్వకాలు సాగించేందుకు ఇది అవకాశం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఒడిశా రాష్ట్రంలో వర్షం పడితే జిల్లాలో భారీ వరదతో పొటెత్తే నాగావళి, వంశధార నదుల గురించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తెలియనది కాదు! అది ప్రకృతి విపత్తు అని సరిపెట్టుకోవచ్చు... కానీ ఎక్కడి నుంచో జిల్లాకు వచ్చి నదుల్లో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతూ పరివాహక ప్రాంతాలకు ముఠాలు పెనుముప్పు తెస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన తర్వాత ఈ ముఠాలు రెక్కలు విచ్చుకున్నాయి. అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులను మచ్చిక చేసుకొనో, వారి బంధువులకు, బినామీలకు వాటాలిచ్చో ఒక్కో ప్రాంతాన్ని వరుసగా దోచుకుపోతున్నాయి. '
 
దూసి రైల్వే స్టేషన్‌ సిబ్బంది క్వార్టర్ల పక్కనుంచి నాగావళి నదీగర్భం వరకూ జీడిమామిడి తోటలను తొలగించి రూ.7 లక్షల ఖర్చుతో కిలోమీటరు రోడ్డును ఇసుక మాఫియా ఆఘమేఘాలపై వేసింది. ఇందుకు అవసరమైన కంకర అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి క్వారీల నుంచి సరఫరా కావడం గమనార్హం. ఇందుకు ప్రతిఫలం ర్యాంపులో ఆయన కుమారుడికి వాటా రూపంలో దక్కింది. అలా ఆరుగురు వాటాదారుల్లో ముగ్గురికి అధికార పార్టీ నేతలతో ఏదొక రూపంలో సంబంధాలు ఉండటం, మాఫియా కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల పేరు చెప్పి బెదిరించడంతో దూసి గ్రామస్థులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. దీనిపై అధికారులు కూడా స్పందించలేదు. యథేచ్ఛగా సాగుతున్న ఈ దోపిడి వ్యవహారాన్ని సాక్షి ఈనెల 16న ‘కళ్లు మూసుకున్నారు!’ శీర్షికతో వెలుగులోకి తీసుకొచ్చింది. 
 
పది రోజుల్లో రూ.56 లక్షల దోపిడీ
 
దూసి ఆర్‌ఎస్‌ ర్యాంపుకు ఇసుక కోసం వచ్చే ఒక్కో లారీకి రూ.4,800 చొప్పున ముఠా వసూలు చేసింది. రాత్రీపగలు తేడాలేకుండా గత పది రోజుల్లో వందల సంఖ్యలో లారీలు ఇసుక తరలించుకుపోయాయి. వాటి నుంచి ముఠా వసూలు చేసింది దాదాపు రూ.56 లక్షలని సమాచారం. 
 
పొక్లెయినర్లను పట్టించుకోలేదు
 
వాస్తవానికి ర్యాంపు వద్ద పొక్లయినర్ల వంటి యంత్రాలేవీ ఇసుక ఎత్తిపోతకు ఉపయోగించకూడదు. కానీ దూసిపేట ర్యాంపులోనే ఆరు పొక్లెయినర్లను పెట్టి నాలుగు నెలల పాటు నిర్విరామంగా లక్షల యూనిట్ల ఇసుక తరలించుకుపోయింది. అదే నిబంధనల ప్రకారం చేస్తే సంవత్సరం అంతా స్థానికులకు ఉపాధి దొరికేది. పొక్లయినర్లను అధికారులు సీజ్‌ చేయకపోవడంతో దూసి ఆర్‌ఎస్‌ ర్యాంపులోనూ మూడు పొక్లెయినర్లను ముఠా దించింది. మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం దూసి గ్రామస్థులతో కలిసి ర్యాంపు వద్ద ఆందోళనకు దిగనున్నారని, అలాగే అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలుసుకున్న ఇసుక మాఫియా అప్రమత్తమైంది. మూడు పొక్లెయినర్లలో ఒకదాన్ని ఉదయాన్నే అక్కడి నుంచి పంపించేశారు. మిగిలిన రెండింటిని నదిపక్కన ఒక గొయ్యిలో గడ్డిమధ్య దాచేశారు. తమ్మినేని బృందం పరిశీలించి వచ్చిన తర్వాత రెవెన్యూ, గనుల శాఖ అధికారులు ర్యాంపులో పరిశీలనకు వచ్చారు. ర్యాంపు అక్రమమని ప్రకటించారు. కానీ ఆ రెండు పొక్లయినర్లను సీజ్‌ చేయలేదు. 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా