ఇది సంకరజాతి ప్రభుత్వం

3 Apr, 2017 23:34 IST|Sakshi
ప్రొద్దుటూరు: రాష్ట్ర మంత్రి వర్గ కూర్పుపై ఈ ప్రభుత్వం అవలంబించిన విధానంపై తాము తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతోపాటు నిరసన తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా, అనైతికంగా  ప్రభుత్వంలో చేర్చుకున్నారని తెలిపారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత శాసనసభలో జరిగిందని అన్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీజేపీ నుంచి ఎన్నిక్కైన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారని వివరించారు. 
బీసీలు, మైనారిటీలకు ప్రాధాన్యత ఏదీ... 
అన్నింటి కంటే బాధ కలిగించే అంశం బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించకపోవడమేనని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీని బీసీల పార్టీగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని, అయితే ఇందులో వాస్తవం లేదన్నారు. 26 మంది మంత్రులున్న ఈ ప్రభుత్వంలో 17 మంది కమ్మ, కాపు, వెలమ, రెడ్డి, వైశ్య తదితర కులాలకు చెందిన వారున్నారని తెలిపారు. ఏడుగురు మాత్రమే బీసీ వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 12 శాతం జనాభా కలిగిన ముస్లిం మైనారిటీలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదన్నారు. ఇది రాజ్యకాంక్షతో చేసిన కూర్పు తప్ప.. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించలేదని పేర్కొన్నారు. వైఎస్సార్‌ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి చంద్రబాబు జెండా, అజెండా వైఎస్సార్‌సీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. ఫ్యాక‌్షన్‌ మనస్తత్వం కలిగిన కుటుంబాలను ఎంచుకున్న చంద్రబాబుకు దీని వలన నష్టమే తప్ప ఓటు బ్యాంకు పెరిగే పరిస్థితి లేదన్నారు. పార్టీ మారి మంత్రి పదువులు పొందిన వారికి ఇదే చివరి శాసనసభ అవుతుందని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణతో టీడీపీ తన తలకు తానే కొరివి పెట్టుకున్నట్లు అయిందని విమర్శించారు. మంత్రి వర్గ కూర్పుపై అటు ప్రజల్లో, ఇటు అధికార పార్టీలో, చివరకు ప్రభుత్వంలో కూడా పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. 
అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే సిగ్గుపడుతున్నా:
సంకరజాతి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ అసెంబ్లీలోకి తాను అడుగు పెట్టాలంటే సిగ్గు పడుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తన మనసు ఈ విషయంపై కఠినమైన నిర్ణయం తీసుకుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసెంబ్లీలోకి ఎడమకాలు కూడా పెట్టకూడదని అనిపిస్తోందని, తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతి ఇస్తే ఇందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సమావేశంలో మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, కౌన్సిలర్లు టప్పా గైబుసాహెబ్, చిలేకాంపల్లి యామిని, రాగుల శాంతి, గోనా సరస్వతి ప్రభాకర్‌రెడ్డి, పోసా వరలక్ష్మి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కొర్రపాడు సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
 
 
 
 
మరిన్ని వార్తలు