సంపూర్ణ సమీకృత దాణాతో ఎంతో మేలు

2 Sep, 2016 19:07 IST|Sakshi
సంపూర్ణ సమీకృత దాణాతో ఎంతో మేలు
మిర్యాలగూడ రూరల్‌ 
జిల్లా వ్యాప్తంగా పశువులు, జీవాలు(గొర్రెలు, మేకలు) పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిని చాలా మంది సాంప్రదాయ పద్ధతిలోనే మేపుతున్నారు. పచ్చిక బయళ్లలోకి తీసుకెళ్లి గాని, ఇంటి వద్దే కట్టేసి గాని మేత మేపుతున్నారు. దాణా వినియోగం నామ మాత్రంగానే ఉంటుంది. కొనే స్థోమత లేక చాలా మంది దాణా జోలికి వెళ్లడం లేదు. దీని వల్ల పశువులకు, జీవాలకు పోషకాలు సరైన నిష్పత్తిలో అందడం లేదు. ఫలితంగా వాటి  ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది. ముఖ్యంగా పాడి పశువుల్లో ఆశించిన మేర పాల దిగుబడి పెరగడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘సంపూర్ణ సమీకృత దాణా ’ మంచి ప్రత్యమ్నాయమని మిర్యాలగూడ వెటర్నరీ ఏడీ జూలకంటి వెంకట్‌ రెడ్డి తెలిపారు. పెద్దగా ఖర్చు లేకుండానే ఎండు పంటలను దాణా దినుసులను కలిపి తయారు చేసుకోవచ్చని  ఆయన వివరించారు. 
 
 
పశువులకు కావాల్సిన అన్ని పోషక పదార్థాలను సరైన మోతాదులో సమకూర్చేలా ఎండ మేతతో సహా అన్ని దాణా  దినుసులను పొడి చేసి మిశ్రమంగా తయారు చేసే దాణాను సమీకృత దాణా అంటారు. ఇందులో పత్తి కట్టె, కంది కట్టె, మొక్క జొన్న చొప్ప, కండెలు, ఉలువ చొప్ప, వేరుశనగ పొట్టు, పొద్దు తిరుగుడు మొక్కలు, పూలు, చింత గింజలు, చెరకు ఆకులు, మొదలైన ఎండు పంటలను, మొక్క జొన్నలు, జొన్నలు తౌడు, గానుగ చెక్క యముకల పొడి, యూరియా దాణా దిగుబడులను ఉపయోగించుకోవచ్చు. 
తయారీ ఇలా...
ముందుగా ఎండు మేత, దాణా దినుసులను యంత్రంలో వేసి పొడి చేయాలి. తరువాత మిక్సర్‌లో నింపాలి. ‘ఫ్రీమిక్స్‌’ చేసిన తరువాత 70 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు వేడిచేసి మొలాసిస్‌ను తగిన మోతాదులో కలపాలి. పది నిమిషాల పాటు అన్ని పదార్థాలను బాగా కలియ బెట్టాలి. ఉదాహరణకు వేరుశనగ పొట్టు 60 కిలోలు, మొక్కజొన్న గింజలు ఎనిమిది కిలోలు, వరి తవుడు ఏడు కిలోలు, సాధారణ ఉప్పు అరకిలో, యూరియా 20.5 కిలోలు, ఖనిజలవణ మిశ్రమం కిలో, మొలాసిస్‌ ఒక శాతం వినియోగించి సంపూర్ణ సమీకృత దాణా తయారు చేసుకోవచ్చు. 
 
ఎన్నో ఉపయోగాలు
సంపూర్ణ సమీకృత దాణా వల్ల పశువులకు కావాల్సిన పోషక పదార్థాలు అన్ని సరైన మోతాదులో లభిస్తాయి. దాణాలో దినుసులు కలుస్తున్నందున పశువులు ఇష్టంగా మేస్తాయి. అదికాక సాంప్రదాయేతర మాంసకృత్తులు(యూరియా)వినియోగం  పెరగడానికి వీలుంటుంది. ఘన పదార్థాల రూపంలో పశువులు ఎక్కువ మేత తినడానికి అవకాశం ఉంది. పాడి పశువులకు ఇది చాలా మంచిది. పాడి శాతం 11 నుంచి 23 వరకు పెరగవచ్చునని పరిశోధనలు తెలుపుతున్నాయి. దాణా ఖర్చు కూడా 21నుంచి 25 శాతం తగ్గుతుంది. గొర్రెల్లో 20–22, మేకల్లో 11–32 శాతం పెరుగుదల నమోదు అయ్యే అవకాశం ఉంది. కరువు పరిస్థితుల్లో గొర్రెలను, మేకలను వలసకు తీసుకువెళ్లకుండా స్థానికంగానే సమీకృత దాణా ఇచ్చి మేపవచ్చు. 
ఎంత మోతాదులో ఇవ్వాలంటే ...
గొర్రెలకు అయితే వాటి శరీర బరువులో మూడు శాతం వరకు ఇవ్వాలి. సా«ధారణ మేకలైతే శరీర బరువులో మూడు శాతం వరకు, పాలిస్తుంటే ఐదు శాతం వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఆవులకు 2.5 శాతం, గేదెలకు మూడు శాతం వరకు ఇస్తే ఫలితం ఉంటుంది.
 
మరిన్ని వార్తలు