నల్లధనం దాచడం, చెలామణి అసాధ్యం

14 Sep, 2016 19:07 IST|Sakshi
భీమవరం టౌన్‌: నల్లధనాన్ని దాచడం, చెలామణి చేయడం అసాధ్యమని ఆదాయ పన్నుశాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జీవీ గోపాలరావు అన్నారు. భీమవరం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ఆదాయ పన్నుశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆదాయ వెల్లడి పథకం (ఐడీఎస్‌)–2016పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదాయ పన్నుశాఖ ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని, బ్యాంకులో నగదు డిపాజిట్‌ చేసినా, క్రెడిట్‌ కార్డులు ఉపయోగించినా, పాన్‌ నెంబరు ఉదహరించకుండా లావాదేవీలు నడిపినా తమకు తెలిసిపోతుందని గోపాలరావు అన్నారు. పిల్లల ఉన్నత విద్యకు పెద్దమొత్తంలో నగదు చెల్లించి విద్యా సంస్థల్లో సీట్లు పొందిన వారి సమాచారం కూడా తమ దగ్గర ఉందన్నారు. రాజమండ్రి కార్యాలయ పరిధిలో పాన్‌ నంబర్‌ లేకుండా లావాదేవీలు జరిపిన 8 వేల మందికి సంబంధించిన, సొమ్ము చెల్లించి కళాశాలల్లో సీట్లు పొందిన వారి సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆస్తులు, ఆదాయం ఉండి పన్ను చెల్లించని వారు, బినామీల పేరును ఆస్తులు ఉన్నవారు ఐడీఎస్‌ పథకాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. 
కోట్లలో లావాదేవీలు.. వేలల్లో రిటర్న్‌లు
ఆదాయ పన్నుశాఖ రేంజ్‌–1 జాయింట్‌ కమిషనర్‌ ఎం.నారాయణరావు, సర్కిల్‌ వన్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ మహేంద్ర మాట్లాడుతూ ఆదాయం ఉన్న చాలామంది రిటర్న్స్‌ దాఖలు చేయడం లేదని, కొందరు రిటర్న్‌లు దాఖలు చేసినా పన్ను చెల్లించడం లేదన్నారు. ఇలాంటి వారందరి సమాచారం తమ వద్ద ఉందన్నారు. భీమవరం వార్డ్‌–1 అధికారి పి.విశ్వనాథరావు మాట్లాడుతూ భీమవరంలో సుమారు 2 లక్షల జనాభా ఉంటే 10 వేల మంది మాత్రమే రిటర్న్‌లు దాఖలు చేస్తున్నామన్నారు. ఇక్కడ కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆదాయ పన్నుశాఖ అధికారి రామావతారం, భీమవరం వార్డు–2 అధికారి కె.రాజశేఖర్, చార్టెడ్‌ అకౌంటెంట్‌ డీవీ నర్సింహమూర్తి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త, ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి శివ, కార్యదర్శులు కాగిత వెంకటరమణ, కార్మూరి నాగేశ్వరరావు, ఘంటా కష్ణహరి, పి.కోటేశ్వరరావు, వర్తక, వాణిజ్య ప్రముఖులు, ఆడిటర్లు, చార్టెడ్‌ అకౌంటెంట్లు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు