పూర్తి నగదు రహితం సాధ్యం కాదు

24 Dec, 2016 00:39 IST|Sakshi
పూర్తి నగదు రహితం సాధ్యం కాదు

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బాబు
సాక్షి, అమరావతి: నగదు రహిత లావాదేవీల అంశంపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మాటమార్చారు. పూర్తి స్థాయిలో నగదు రహితం సాధ్యం కాదని ఆయన తాజాగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకే ఇది సాధ్యం కాలేదన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన 197వ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ‘నగదు రహిత లావాదేవీ’లను ప్రోత్సహిం చడం కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల కమిటీకి చైర్మన్ అయిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ప్రజలు పూర్తిగా నగదు రహిత లావాదేవీల వైపు మళ్లాలని ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన నోటి నుంచి పూర్తిస్థాయిలో నగదు రహితం సాధ్యం కాదన్న మాటలు వెలువడడం విశేషం. అయితే నగదు రహిత లావాదేవీల అంశంలో ప్రజల సైకాలజీ మారాలని ఆయనీ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజలు నగదు లావాదేవీల నుంచి నగదు రహిత లావాదేవీలకు మారాల్సిన అవసరముందన్నా రు. బయోమెట్రిక్‌ విధానంతో కేవలం ఆధార్‌ నంబర్‌ ఆధారంగా మొబైల్‌ నుంచే లావాదేవీలు జరుపుకునే సౌలభ్యాన్ని కనుగొనడం జరిగిందన్నారు.

ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు..
ఇదిలా ఉండగా పెద్ద నోట్ల రద్దు అంశంపైనా చంద్రబాబు మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ప్రతీ ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇలాంటి సుదీర్ఘమైన సమస్యను తన రాజకీయ జీవితంలో ఎదుర్కొనలేదని వ్యాఖ్యానించారు. పెన్షన్లను బ్యాంకు ఖాతాల్లో వేయడం వల్ల క్యూలైన్లలో నించోలేక అనేకమంది మరణించారని,  మరికొందరు అనారోగ్యం పాలయ్యారని అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయాయని అంటూ.. వీటిని త్వరగా పునరుద్ధరించాల్సిన అవసరముందన్నారు.

మాకు నో రూల్స్‌: బాబు
‘‘రాజకీయంగా మాకు తలనొప్పులు రాకుండా చూడండి. నిబంధనలున్నా మమ్మల్ని దృష్టిలో ఉంచుకోండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు హితబోధ చేశారు. రెండు రోజుల జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏకంగా ముఖ్యమంత్రే నిబంధనలను పాటించవద్దని, అధికార పార్టీ వారి విషయంలో చూసీచూ డనట్లు వ్యవహరించాలని పేర్కొనడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోయింది. నిబం ధనల ప్రకారం వెళితే తమకు ఇబ్బందులు వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘‘రెండున్నరేళ్ల తరువాత మేము ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల రిఫరీలు, పరిశీలకులుగా వస్తారు. మేము మాత్రం పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి న బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. ప్రతి విషయంలోనూ అధికార యంత్రాంగం నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ముందు కెళితే రాజకీయంగా మాకు ఇబ్బందులు తప్పవని దృష్టిలో ఉంచుకోవాలి’’ అని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో అధికులు అసంతృప్తితో ఉన్నారని సీఎం చెప్పారు.  రాయలసీమ  జిల్లాల నుంచి  అమరావతి వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్‌ రహదారికి ఏకంగా 26,700 ఎకరాల భూమిని సమీకరించడం సాధ్యం కాదని ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. బాబు మాత్రం సమీకరణే తప్ప భూసేకరణ వద్దని తేల్చిచెప్పారు.

2018లో అమరావతిలో జాతీయ క్రీడలు
అమరావతిలో 2018లో జాతీయ క్రీడలను నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన ఇబ్రహీంపట్నం మూలపాడులో 28వ ఆలిండియా అడ్వకేట్స్‌ క్రికెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు