ఐటీఐలో ‘కౌలు’ పంచాయితీ!

7 Jul, 2017 05:09 IST|Sakshi
ఐటీఐలో ‘కౌలు’ పంచాయితీ!

నల్లగొండలోని ప్రభుత్వ బాలుర,
న్యూ ఐటీఐల మధ్య చిచ్చురేపిన పచ్చిగడ్డి
ప్రాంగణంలోని పచ్చికబయళ్లు, చెట్లను బేరం పెట్టిన ఘనులు
మేకలు, గేదెలు కాసుకునేవారికి ఏడాది పాటు కౌలుకు
కౌలు డబ్బుల పంపకాల్లో తేడాలు రావడంతో రచ్చకెక్కిన వివాదం
న్యూ ఐటీఐకి నీటి సరఫరా నిలిపివేసిన బాలుర ఐటీఐ
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

నల్లగొండ: ఐటీఐలో ‘కౌలు’ పంచాయితీ.. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. నమ్మశక్యం కానీ, బయటికి కనిపించని ఆసక్తికరమైన సంఘటనలు నల్లగొండలోని ప్రభుత్వ ఐటీఐల్లో వెలుగుచూస్తున్నాయి. నల్లగొండ జిల్లాలోని ఐటీఐలకు పెద్దన్న పాత్ర (కన్వీనర్‌) పోషించేది ‘న్యూ ఐటీఐ’.  కాగా సూర్యాపేట జిల్లాలోని ఐటీఐలకు పెద్దతలకాయగా (కన్వీనర్‌) వ్యవహరించేది బాలుర ఐటీఐ. ఈ బాలుర ఐటీఐకీ ‘బిగ్‌బాస్‌’ కూడా ‘న్యూ ఐటీఐ’నే. ఈ రెండింటి మధ్య ‘పచ్చిగడ్డి’ వేస్తే భగ్గుమనే సంఘటన ఒకటి ఇటీవల చోటుచేసుకుంది. పెద్ద తరహాగా భావించే న్యూ ఐటీఐ కన్వీనర్‌కు కనీసం మాటమాత్రం కూడా చెప్పకుండా బాలుర ఐటీఐలో పనిచేస్తున్న దిగువ శ్రేణి ఉద్యోగుల్లో కొందరు ‘కౌలు కుంపటి’ రాజేశారు.  
చెట్టును, పుట్టను వదల్లేదు..
సుమారు 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రెండు ఐటీఐల పరిసర ప్రాంతాల్లో పొడవైన చెట్లు, పచ్చికబయళ్లు ఏపుగా పెరిగాయి. విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ రకాల పనుల కోసం వచ్చివెళ్లే వారితో ఐటీఐ ప్రాంగణమంతా ఎప్పుడూ సందడిగానే కనిపిస్తుంది. మరి అంతటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల కన్ను పొడవైన చెట్లు, పచ్చికబయళ్లపైన పడింది. ఇంకేముంది..!

అనుకున్నదే తడవుగా అదే ఐటీఐకి చెందిన కొం దరు అధికారుల సహకారంతో మొత్తం 24 ఎకరాల్లో విస్తరించి ఉన్న పచ్చికబయళ్లు, చెట్లను కౌలుకివ్వాలని తీర్మానించుకున్నారు. అయితే ఈ కౌలుకు ఇవ్వాలనే ఒప్పందం గత పదేళ్ల నుంచి నిరంతరంగా కొనసాగుతూ వస్తోంది. బీటీఎస్, మేకల అభినవ్‌ స్టేడియం ప్రాంతాల్లో గేదెలు, గొర్రెల కాపలాదారులతో మాట్లాడుకుని కౌలు ఒప్పందం చేసుకున్నారు. ఏడాదికి రూ. ఆరు నుంచి రూ. పదివేల వరకు కౌలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. నేల కొరిగిన చెట్లు, వంట చెరుకును సైతం వదిలిపెట్టకుండా బేరం పెట్టారు. గత కొన్నేళ్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారం ముదిరిపోవడంతో రచ్చకెక్కింది.

వివాదం వెలుగులోకి..
కొద్ది రోజుల క్రితం గొర్రెలు, గేదెలను తోలుకుని కాపలాదారులు న్యూ ఐటీఐ వైపునకు వెళ్లా రు. దాంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. పశువులు, గొర్రెలకు గడ్డి మేపుకునేందుకు ఏడాదికి రూ.ఆరు వేల చొప్పున బాలుర ఐటీఐకి చెల్లిస్తున్నా మని కాపలాదారులు చెప్పినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని కాపలా దారులు వెళ్లి బాలుర ఐటీఐలో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన రెండు ఐటీఐల మధ్య వివా దానికి దారితీసింది. న్యూ ఐటీఐ అవసరాలకు వెళ్లే నీరు బాలుర ఐటీఐ నుంచే సరఫరా అ వుతోంది. దీంతో కాపలాదారులను అడ్డుకున్నారన్న అక్కసుతో బాలుర ఐటీఐ నుంచి న్యూ ఐటీఐకి నీటి సరఫరా నిలిపేశారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందోనన్న భయంతో బాలుర ఐటీఐలోని కొందరు ఉద్యోగులు చొరవ చూపించి న్యూ ఐటీఐ అధికారులతో రాజీకుదు ర్చకున్నారు. ఎట్టకేలకు వివాదం సద్దుమణగడంతో నీటి సరఫరా కొనసాగించారు. అంతే గాక బాలుర ఐటీఐ అధికారులే మళ్లీ కాపలాదారులను రప్పించి కౌలు ఒప్పందాన్ని యథా విధిగా కొనసాగించడం గమనార్హం.

ఇప్పుడు ఎవరూ రావడం లేదు
మేకలు, గేదెలు మేపేందుకు వస్తే వద్దని చెప్పాం. దాంతో వారు రావడం మానే శారు. కొద్ది రోజుల నుంచి మా వైపు రావడం మానేశారు. ఇక్కడ హరితహారం కింద నాటిన మొక్కలు పెంచుతున్నాం. పశువులు  వస్తే వాటిని ఆగం చేస్తాయని వద్దని చెప్పాం.  
– గోపాల్‌ నాయక్, కన్వీనర్‌

రూ. ఆరు వేలు చెల్లిస్తున్నా
మేకలు, గేదెలు మేపుకునేందుకు బాలుర ఐటీఐకి ఏడాదికి రూ.ఆరు వేలు చెల్లిస్తున్నా. రెం డేళ్ల నుంచి ఇక్కడే మేపుతున్నా. నా కంటే ముందు కమ్మరోళ్లు వచ్చిండ్రు. ఈ మధ్య రెండు ఐటీఐల మధ్య గొడవ జరిగింది. డబ్బులు బాలుర ఐటీఐకి ఇచ్చిన సంగతి కిందోళ్లకు తెలి యదంట. మేకలను తోలుకుని పోతే కిందోళ్లు.. ఇక్కడ మేపొద్దని అడ్డుకున్నారు. దాంతో నేను బాలుర ఐటీఐకి వచ్చి చెప్పిన. నేను చెప్పిన అని కిందోళ్లకు నీళ్లు ఆపేశారంట.
– సత్తయ్య, బీటీఎస్‌

మరిన్ని వార్తలు