ఆ ఎమ్మెల్యే ఆస్తులు రూ.500 కోట్లు

20 Jan, 2017 01:27 IST|Sakshi
ఆ ఎమ్మెల్యే ఆస్తులు రూ.500 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రూ.500 కోట్లకు మించి లెక్కచూపని ఆస్తులు కలిగి ఉన్న నారాయణపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై ఆదాయ పన్ను శాఖ కేసులు నమోదు చేసింది. కర్ణాటకలో ఒక మెడికల్‌ కాలేజీతో పాటు పలు విద్యా సంస్థలు కలిగి ఉన్న రాజేందర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ జిల్లాలోని నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారం మేరకు.. ఆదాయ పన్ను శాఖ 2015 డిసెంబర్‌లో ఆయన నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. ఆ దాడుల్లో రూ.20 కోట్ల నగదుతో పాటు వందల కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి.

గత ఆరేళ్లుగా ఆయన దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ఆయన వద్ద లభించిన ఆస్తిపాస్తులను పోల్చి చూసిన ఐటీ అధికారులు.. దాదాపు రూ.500 కోట్ల మేర లెక్క చూపని ఆస్తులు ఉన్నట్లు లెక్క తేల్చారు. దీంతో గతేడాది నవంబర్‌లో ఆదాయ పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్‌ విభాగం రాజేందర్‌రెడ్డిపై కేసులు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసినందుకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 276 (1), సెక్షన్‌ 277ల కింద కేసులు నమోదు చేసింది. దీంతో ఐటీ అధికారులు తనను అరెస్టు చేస్తారన్న భయంతో సదరు ఎమ్మెల్యే డిసెంబర్‌లో రాయచూర్‌ ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందారు. అనంతరం బెంగళూరులోని ఆదాయ పన్ను శాఖ అధికారి ముందు విచారణకు హాజరయ్యారు.