ముమ్మాటికీ మోసమే

27 Sep, 2016 00:04 IST|Sakshi
ముమ్మాటికీ మోసమే
  • హోదా విషయంలో కేంద్రం మోసం చేస్తే...బాబు లొంగిపోయారు
  • సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు
  • అనంతపురం అర్బన్‌: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను మోసం చేసిందని, ఈ విషయంలో పోరాడాల్సిన చంద్రబాబు ప్రధాని మోదీ దయాదాక్షిణ్యాలు చాలంటూ సాగిలపడ్డారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

    సోమవారం అనంతపురం జిల్లాకు విచ్చేసిన ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేశారని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని పలు సందర్భాల్లో చెప్పిన చంద్రబాబు.. ప్యాకేజీ చాలంటూ మాట మార్చారన్నారు. ఏపీకి ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ఆరుణ్‌జైట్లీ పార్లమెంట్‌లో చేసిన ప్రకటన విన్న తర్వాత తన రక్తం మరుగుతోందని చెప్పిన చంద్రబాబు ఇపుడు మాత్రం ప్యాకేజీ బాగుందంటూ మురిసిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుస్తోందన్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగులను, లక్షలాది మంది విద్యార్థులను, యువ పారిశ్రామిక వేత్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నట్టేట ముంచాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సంఘటితమై హోదాకోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సహాయ కార్యదర్శులు జాఫర్, నారాయణస్వామి పాల్గొన్నారు. 

     

మరిన్ని వార్తలు