‘స్వచ్ఛ భారత్’కు బ్రాండ్ అంబాసిడర్‌ను చేస్తే బాగుంటుందేమో?

3 Apr, 2016 02:25 IST|Sakshi
‘స్వచ్ఛ భారత్’కు బ్రాండ్ అంబాసిడర్‌ను చేస్తే బాగుంటుందేమో?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉధృతంగా సాగుతోందట. ఇతర రాష్ట్రాల్లో సెటిలర్లు వచ్చి మరీ తమ తమ ఖాళీ స్థలాల్లో చెత్త, మురుగు నీటిని తొలగించడం వంటి పనులకు శ్రీకారం చుడుతున్నారట. ఇంతటి ఊపుతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుందేంటా? మోడీ ఇచ్చిన పిలుపు కారణమా? జన్మభూమిపై మమకారమా? అన్న ప్రశ్నలు మెదళ్లను తొలుస్తున్న వారంతా ఆరా తీస్తే వారికి విస్తుబోయే నిజాలు తెలుస్తున్నాయట.

అమరావతి పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఓ టీడీపీ ముఖ్య నేత తనయుడి ఆక్రమణలు పెచ్చుమీరాయి. దీంతో తమ ఖాళీ స్థలాల్ని నిరుపయోగంగా ఉంచితే ఎక్కడ కబ్జా చేస్తారోనన్న భయంతో ఖాళీగా ఉన్న స్థలాల్ని కొత్త రూపు సంతరించుకునేలా చేస్తున్నారట. ఎక్కడ జాగా కనబడితే అక్కడ పాగా వేస్తున్న సదరు టీడీపీ నేత తనయుడు వ్యవహారంతో మురుగు నీటితో కంపు కొడుతున్న స్థలాలు కళ కళలాడుతున్నాయి. ఖాళీ స్థలాలలో చిన్న పాటి గుడిసైనా వేసుకుని తమ స్థలాన్ని పరిశుభ్రంగా కాపాడుకుంటున్నారట. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సదరు ముఖ్య నేత తనయుడిని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలు సెటైర్లు విసురుతున్నారట.

>
మరిన్ని వార్తలు